ఒకే నెలలో ఐదు సార్లు రాష్ట్రానికి!

12 Nov, 2023 00:49 IST|Sakshi

ఎన్నికల నేపథ్యంలో వరుసగా మోదీ పర్యటనలు 

ఇప్పటికే 7వ తేదీన, శనివారం సభల్లో పాల్గొన్న ప్రధాని 

25న కరీంనగర్, 26న నిర్మల్‌లలో సభలు.. 27న హైదరాబాద్‌లో రోడ్‌షోకు ప్లాన్‌ 

గత నెలలోని రెండు పర్యటనలు కలిపితే ఏడుసార్లు రాష్ట్రానికి.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల ఏడో తేదీన, తాజాగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లోనూ బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది.

ఈనెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. బీజేపీకి ఊపు తెచ్చేందుకు 25న కరీంనగర్, 26న నిర్మల్‌ బహిరంగ సభల్లో, 27న హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోలో మోదీ పాల్గొననున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ పర్యటన షెడ్యూల్‌ ఖరారైతే.. ప్రధాని మోదీ నెల రోజుల్లోనే ఐదుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. అయితే ప్రధాని గత నెల 1, 3వ తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవి కూడా కలిపితే రెండు నెలల్లో ఏడుసార్లు రాష్ట్రానికి వచ్చినట్టు అవుతుంది. 

దీపావళి దాటగానే జోరు 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపావళి పండుగ దాటగానే జోరు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. దీపావళి తర్వాత పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకు ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యూపీ, మహారాష్ట్ర, అస్సాం, గోవా సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ఏక్‌నాథ్‌ షిండే, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్‌లతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు