ఓట్లు, సీట్లు పెరుగుతాయ్‌!

1 Dec, 2023 01:03 IST|Sakshi

12–15 అసెంబ్లీ సీట్లలో గెలిచే అవకాశం ఉందంటూ కమలదళం ధీమా 

పోలింగ్‌ సరళిపై అమిత్‌ షా, నడ్డా ఆరా... 

సాక్షి, హైదరాబాద్‌:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి అంచనాలకు అందని విధంగా ఉండటంతో బీజేపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుపొందడంతోపాటు, గణనీయంగా ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంటామనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌లలో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్న పరిస్థితులనూ పార్టీ బేరీజు వేస్తోంది.

వివిధ వర్గాల ప్రజలు పోలింగ్‌కు హాజరైన తీరు తదితర అంశాలను బట్టి ఓటర్ల నాడిని పసిగట్టడం సాధ్యం కాకపోవడంతో నమోదైన తుది పోలింగ్‌ శాతాన్ని బట్టి పరిస్థితి అంచనా వేయొచ్చనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నారు. యువత ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొన్నదనే అంచనాల మధ్య ఈసారి ఎక్కువ చోట్ల పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

45–50 చోట్ల పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని (బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతో ముఖాముఖి, త్రిముఖ పోటీలు కలుపుకుని), వాటిలో అధిక స్థానాల్లో రెండోస్థానంలో నిలుస్తామని, కనీసం 12–15 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఓట్ల శాతంతోపాటు సీట్లు కూడా పెరుగుతాయనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోంది.
 
పుంజుకున్న బలం  
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 శాతం ఓట్లతో ఒకేఒక సీటు సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్‌ శాతం పెరిగి, 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీన్నిబట్టి చూస్తే గత లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుందని అంటున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించడం, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవడం వంటి సానుకూల పరిణామాలను ఉదహరిస్తున్నారు.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం 20కి చేరుకోవడంతోపాటు 12–15 స్థానాలు సాధిస్తామనే ధీమా వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే ప్రకటన, ఎస్సీ వర్గీకరణపై అనుకూల నిర్ణయం వంటివి పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయంటున్నారు.  

బిజీబిజీగా ముఖ్యనేతలు  
గురువారం పోలింగ్‌ సందర్భంగా... క్షేత్రస్థాయిలోని నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్‌ తీరు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పార్టీ ముఖ్యనేతలు బిజీబిజీగా గడిపారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి ఓటింగ్‌ సరళి, పార్టీ పరిస్థితి, ఇతర అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ పరిశీలించారు. ఫోన్‌ ద్వారా పార్టీ నాయకుల నుంచి కిషన్‌రెడ్డి సమాచారాన్ని క్రోడీకరించే ప్రయత్నం చేశారు.

పలుచోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల అక్రమాలకు పాల్పడినా పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ సరళిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. మధ్యాహ్నం 3 గంటలకు వారు కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఓటింగ్‌ ప్రక్రియ ఎలా సాగుతోంది, ఎన్ని సీట్లలో గెలుస్తామనే విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు