రైల్వే లైన్లకు స్థలాలు వెంటనే అప్పగించండి | Sakshi
Sakshi News home page

రైల్వే లైన్లకు స్థలాలు వెంటనే అప్పగించండి

Published Fri, Dec 1 2023 1:02 AM

- - Sakshi

కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి

గుంటూరు వెస్ట్‌: విజయవాడ–గూడూరు మూడో రైల్వే లైను నిర్మాణానికి సేకరించిన స్థలాల్ని వెంటనే ఆ శాఖ అధికారులకు అప్పగించాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం రైల్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే లైనుకు సంబంధించి పొన్నూరు, మంగళగిరి మండలాల్లో పలు స్థలాల్ని ఇప్పటికే సేకరించారని తెలిపారు. వీటిల్లో పెండింగ్‌లో ఉన్న వాటితో పాటు సేకరించిన స్థలాల్ని సైతం పరిశీలించి, తక్షణం ఆధీనంలోకి తెచ్చుకోవాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, రైల్వే డీజీఎం సుధీర్‌ బాబు, అసిస్టెంట్‌ మేనేజర్‌ మోహన్‌, కాశీరత్నం పాల్గొన్నారు.

3న పంచారామాలకు ప్రత్యేక బస్సులు

నరసరావుపేట: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని పంచారామాలకు 3, 10 తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ బత్తుల వీరాస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామర్లకోట కుమార రామం, ద్రాక్షారామం, భీమారామం, పాలకొల్లు క్షీరారామం భీమవరం సోమారామం, అమరావతి అమరారామాలకు ఆదివారం రాత్రి 9 గంటలకు బయలుదేరి సోమవారం ఐదు క్షేత్రాలు దర్శించుకునే విధంగా స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 7382896041, 7382896038. 9959225428 నంబర్లను సంప్రదించాలని కోరారు.

నేటి నుంచి ఘంటసాల జయంతి మాసోత్సవాలు

బాపట్ల అర్బన్‌: ఘంటసాల 101 జయంతి సందర్భంగా ఆల్‌ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక, ఘంటసాల కళాభిమానులు, సంగీత అభిమానులు, సోదర సంఘాల ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి మాసోత్సవాల్ని నిర్వహిస్తున్నట్లు ఆల్‌ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం చైతన్య భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. చీరాలలో ఉదయం 10 గంటలకు ఘంటసాల విగ్రహం వద్ద, మధ్యాహ్నం 12:30 గంటలకు బాపట్లలోని ఘంటసాల విగ్రహం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో ఘంటసాల చైతన్య వేదిక సభ్యులు, సంగీత ప్రియులు పాల్గొనాలని కోరారు.

Advertisement
Advertisement