బాబు హయాంలో అన్నింటా దోపిడీనే!.. కుప్పంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం: సీఎం జగన్‌

19 Oct, 2023 12:55 IST|Sakshi

సాక్షి, కర్నూల్‌:  ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.అదే గతంలోని చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోను, ఎన్నికల హామీలను చెత్తబుట్టలో పడేసిందని గుర్తు చేశారు.  జగన్న చేదోడు కార్యక్రమం కోసం గురువారం ఎమ్మిగనూర్‌ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
చిక్కటి చిరునవ్వులు, చెరగని ఆత్మీయతలు మధ్య ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 

నిరుపేదల జీవన ప్రయాణంలో తోడుగా..
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. వెనుకబడిన కులాలను, వర్గాలను వెన్నుముక కులాలుగా మారుస్తామని పాదయాత్రలో మాట ఇచ్చాం. ఈరోజు మీ బిడ్డగా, మీ అన్నగా సగర్వంగా తలెత్తుకుని చెబుతున్నాను.

ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతి కార్యక్రమం ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాం. వారి జీవన ప్రయాణంలో తోడుగా ఉండగలిగాం. 

ఈ రోజు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా సొంత షాపు ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్‌ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా రూ.10వేలు ఆర్ధిక సాయం చేస్తూ జగనన్న చేదోడు ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.

3.25 లక్షల మందికి రూ.325 కోట్ల చేదోడు..
ఇవాళ క్రమం తప్పకుండా వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని అమలు చేస్తూ... 3.25 లక్షల మందికి రూ.325 కోట్లు బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ రోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ 3.25 లక్షల మంది జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల్లో 1.80 లక్షల మంది టైలర్‌ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు, 1,04,500 లక్షల మంది రజక సోదరులు, అక్కచెల్లెమ్మలకు, దాదాపు 40వేల నాయీ బ్రాహ్మణ అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుంది. 

కేవలం జగనన్న చేదోడు అనే పథకం ద్వారా ఇవాళ జమ చేస్తున్న నగదుతో కలిపితే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.1251 కోట్లు అందించాం. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క చేదోడు పథకం ద్వారా లక్షలాది మందికి రూ.40 వేల వరకు వారి కుటుంబాలకు ఇవ్వగలిగాం. 

గతానికీ ఇప్పటికీ పోల్చి చూడండి. 52 నెలల కాలంలో ప్రతి అడుగు ఈ విధంగానే వేస్తూ.. రూ. 2.38 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా ఎవ్వరూ లంచాలు అడగడం లేదు. వివక్ష చూపించడం లేదు. మీ బిడ్డ హయాంలో మన ప్రభుత్వంలో ఈ రకంగా మంచి చేయగలిగాం. 

చేతివృత్తులను నమ్ముకుని చిన్న చిన్న షాపులు పెట్టుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఇటువంటి వారు బతకలేని పరిస్థితిలోకి వస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోదా? ఇటువంటి వారి గురించి ఇంతకముందు ఎవరైనా ఆలోచన చేశారా? గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచన చేయని విధంగా ఈ 52 నెలల పాలనలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నాం. చేదోడు, వాహన మిత్ర, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉంటున్నాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడకుండా వారందరికీ సహాయం అందించే కార్యక్రమం నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోంది.

ప్రతి అడుగులోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వర్గాలు అంటూ ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం జరుగుతోంది.  ప్రతి పేద ఇంట్లో నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటున్నాం. వారి పిల్లలకు సొంత మేనమామగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. 

అక్కచెల్లెమ్మలకు తోడుగా– నవరత్నాలు..
అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని, వారికి తోడుగా నిలబడుతూ ఈ నాలుగేళ్లలో కేవలం అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్‌ ఆసరా ద్వారా పొదుపు సంఘాల్లో ఉన్న వారిని చేయి పట్టుకొని నడిపిస్తూ తోడుగా ఉన్నాం. 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అందించిన సాయం ఇప్పటికి రూ.19,178 కోట్లు. 

మరలా ఈ జనవరిలో మరో రూ.6,500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ ఆసరా కింద ఇవ్వనున్నాం. ఆక్కచెల్లెమ్మలు బాగుండాలని... వారికి సున్నా వడ్డీ కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. 

వైఎస్సార్‌ చేయూత పథకం ఈ పథకం కింద 45–60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీకి చెందిన 26,39,703 మంది అక్కచెల్లెమ్మలని ప్రోత్సహిస్తూ అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లాంటి సంస్థలను తీసుకురావడమే కాకుండా బ్యాంకులతో వారిని అనుసంధానం చేసి తోడుగా ఉన్నాం. ఒక్క వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా బటన్‌ నొక్కి మీ బిడ్డ పంపించిన సొమ్ము రూ.14,129 కోట్లు.  ఈ జనవరిలో వైయస్సార్‌ చేయూత కింద మరో రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నాం. 

కాపు నేస్తం  ఈ  పథకం కింద 3,57,844 మందికి తోడుగా నిలబడ్డాం. వారికి రూ.2,028 కోట్లు ఇచ్చాం. వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా పేద 4.40 లక్షల మందిఅక్కచెల్లెమ్మలకు రూ.1257 కోట్లు ఇవ్వగలిగాం. 

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా ఈ పథకం ద్వారా 2,43,394 మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ 538 కోట్లు ఇవ్వగలిగాం.  వైయస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా 82 వేల చేనేత కుటుంబాలకు ఇప్పటికే ఇచ్చిన సాయం రూ.982 కోట్లు. వాహన మిత్ర ద్వారా 2,75,931 మంది డ్రైవర్‌ అన్నదమ్ములకు రూ.1,302 కోట్లు బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశాం. జగనన్న తోడు ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చిరువ్యాపారాలు చేసుకుంటున్న.. 15,87,492 మంది చిరు వ్యాపారులకు రూ.2956 కోట్లు ఇవ్వగలిగాం. వడ్డీ వ్యాపారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రూ.10వేలు ఒక్కొక్కరికి ఇస్తున్నాం. 

ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇంతకు ముందు జరిగాయా? ఇవ్వగలిగారా? అని ఆలోచన చేయాలి.  ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం వస్తుంది, ఎక్కడా లంచాలు లేవు, అర్హత ఉంటే చాలు నా ఖాతాలోకి డబ్బు వస్తుందని నాలుగు సంవత్సరాల క్రితం ఎవరైనా అనుకున్నారా?  ఇవన్నీ 52 నెలల మన పరిపాలనలో.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి. 

అప్పుడైనా, ఇప్పుడైనా అదే బడ్జెట్, అదే రాష్ట్రం, మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ఆలోచన చేయమని అడుగుతున్నాను. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు పెరుగుదల కూడా అప్పటి కంటే ఇప్పుడు తక్కువే.  మరి అప్పుడు ఎందుకు జరగలేదు? మీ బిడ్డ పరిపాలనలో ఎందుకు జరుగుతోంది ఆలోచన చేయమని అడుగుతున్నాను.

గతానికి ఇప్పటికీ తేడా ఏమిటో తెలుసా?  ఒకే ఒక్క తేడా. మీ బిడ్డ మనసు. బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. 

దోచుకునే గజదొంగల ముఠా... 
అప్పట్లో జరిగేదేమిటి? ఒక గజదొంగల ముఠా. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు నాయుడు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్లందరూ కూడా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకన్నది తినుకోవడం. అప్పటికి ఇప్పటికి తేడా ఇదీ. 

అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి. ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. ఎక్కడా ఎవరూ లంచాలు అడగటం లేదు. ఎవరూ వివక్ష కూడా చూపించడం లేదు. ఈ తేడాను గమనించండి.

పేద కుటుంబాలు కోరుకునేది... 
ఏ పేద కుటుంబం అయినా కూడా ఏం కోరుకుంటుంది? రైతు కావొచ్చు, కూలీ కుటుంబం కావొచ్చు, ఎవరైనా ఏమి కోరుకుంటారు.  సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న వారైనా, పేదరికంలో ఉన్న వారు ఏం కోరుకుంటారు?  పేదరికంలో ఉన్న  వాళ్లందరూ కోరుకొనేది తమ కుటుంబానికి ఎప్పుడైనా వైద్యం అవసరమైతే అది ఎన్ని లక్షలైనా ప్రభుత్వం మంచి మనసుతో వాళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వం రావాలి, కావాలని కోరుకుంటుంది. 

ప్రతి పేద కుటుంబం.. తమ కుటుంబానికి తమ ఇంటి ముందుకే వచ్చి తమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ లంచాలు లేకుండా, వివక్ష చూపకుండా పౌర సేవలన్నీ వాళ్ల చేతికి ఇచ్చిపోయే ప్రభుత్వం కావాలని కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా... తమ కుటుంబానికి ఇంటి స్థలమో, ఇల్లు అవసరం

అయినప్పుడు దాన్ని ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇల్లు కట్టించి ఇవ్వాలన్న తపన, తాపత్రయం ఉన్న ప్రభుత్వం రావాలి, కావాలని కోరుకుంటుంది. 

ఏ పేద కుటుంబమైనా... వారి కష్టాలను అర్థం చేసుకొని ఒక నిరుపేద కుటుంబాన్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడేసేందుకు.. ఆ కుటుంబంలోని పిల్లలను చదివించే మంచి మేనమామ ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. 

ఏ పేద కుటుంబమైనా... అవ్వాతాతలను సంతృప్త స్థాయిలో ఆదుకోవాలని, అటువంటి మనసున్న పాలకులు రావాలని కోరుకుంటుంది. 

అక్కచెల్లెమ్మల సాధికారతకు, అండగా, తోడుగా నిలబడే ఒక మంచి అన్నయ్య, మంచి తమ్ముడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండాలని ప్రతి పేద కుటుంబం కోరుకుంటుంది. 

ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి మార్పులన్నీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, గ్రామంలో కుటుంబంలో ఈ మార్పులు మన కళ్ల ఎదుటే ప్రస్ఫుటంగా కనిపించేట్టుగా పాలన కనిపిస్తే అలాంటి పాలనను ఏమంటారు? 
అలాంటి పాలనను.. అదీ మా పాలన, మనందరి పాలన అంటారు. మా బిడ్డ పాలన అంటారు. మా అన్న, మా తమ్ముడు జగనన్న పరిపాలన అంటారు. 

చంద్రబాబు గత పాలన చూస్తే...
మరి అదే గతంలో చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మా వాడు అని చెప్పుకొనే పరిస్థితి కూడా లేని పాలన అక్కడ కనిపిస్తుంది. ఆ కుప్పంలో కూడా పేద వాడికి ఇంటి స్థలం కావాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చేయలేకపోయాడు.

ఆ కుప్పంలో 20 వేల ఇంటి స్థలాలు ఇచ్చినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. 8 వేల ఇళ్లు కట్టిస్తున్నది మీ బిడ్డ ప్రభుత్వమే.  ఎన్నికలప్పుడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు అన్న మాటలు మీ అందరికీ గుర్తున్నాయా ? అప్పట్లో ఎన్నికలప్పుడు మీ అందరి ఇళ్లకు లెటర్లు తీసుకొచ్చారు. చంద్రబాబు, దత్తపుత్రుడి సంతకంతో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో  ఎన్నికలప్పుడు ఇంటికి వెళ్లి టీవీ ఆన్‌ చేస్తే చాలు చంద్రబాబునాయుడు ముఖమే కనిపించేంది.

రూ. రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో పెట్టిన రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనే మాటలు వినిపించేవి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రూ.  87,617 కోట్లు వ్యవసాయ రుణాల మాఫీ, ఇంటికి బంగారం రావడం దేవుడెరుగు.. అప్పటి దాకా రైతులకు వస్తున్న సున్నా వడ్డీ పథకం కూడా ఈ పెద్దమనిషి ఎత్తేశాడు. మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పిన పెద్దమనిషి కేవలం రూ. 15 వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. సున్నా వడ్డీ పథకం కూడా రైతులకు రద్దై..  బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితిలో రైతన్న పడిన కష్టాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 

మీ బిడ్డ పాలనలో...
మీ బిడ్డ పాలన 2019 మేనిఫెస్టోలో ఏ మాట చెప్పామో, అంతకన్నా మిన్నగా ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించే విధంగా తోడుగా ఉంటూ నడిపిస్తున్న మీ ప్రభుత్వం. 

ఎన్నికలు అయిపోయిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసింది బాబు ప్రభుత్వం. కనీసం 10 శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాను.  ఎన్నికలప్పుడు మీ బిడ్డ మాట ఇచ్చాడు. మేనిఫెస్టో తెచ్చాడు. 

చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చి, మేనిఫెస్టోను  ప్రతి గడపకూ తీసుకెళ్లి, అక్కా జగన్‌ ఈ మాట చెప్పాడు. చెప్పిన ప్రతి మాటా చేశాడు అని ప్రతి గడప వద్దకూ వెళ్లి వాళ్ల ఆశీస్సులు తీసుకున్న పాలన మీ బిడ్డ పాలన. తేడా గమనించండి.                                                                                                        

బాబు జన్మభూమి కమిటీల నుంచి మద్యం అక్రమాలు వరకు...
గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాజధానిలో భూముల నుంచి, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ వరకు, అక్కడ నుంచి ఫైబర్‌ గ్రిడ్‌ దాకా, చివరికి మద్యం కొనుగోళ్లలో కూడా ఎక్కడ పడితే అక్కడ దోచేయడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం తప్ప వేరేది ఏమీ కనిపించలేదు. 

కానీ మీ బిడ్డ పాలనలో రూపాయి, పది రూపాయలు కాదు,  వంద, లక్ష, కోటి రూపాయలు కాదు.. ఏకంగా రూ.2.38 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతుంది. వివక్ష చూపించే పరిస్థితి లేదు, లంచాలు అడిగేవాడూ లేడు. 

పొదుపు సంఘాలను, నా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తూ అప్పట్లో చంద్రబాబు అన్న మాటలు గుర్తున్నాయా?
అప్పట్లో టీవీల్లో అడ్వర్టైజ్‌మెంట్లలో ఒక అక్కను, ఒక చెల్లెమ్మనూ చూపించి.. ఆ మంగళసూత్రాన్ని ఒకరు లాక్కొని పోయేవారు. వెంటనే ఒక చేయి వచ్చి పట్టుకుని ఆపేవారు. బాబు వస్తాడు, మంగళ సూత్రం నిలబడుతుందని అడ్వర్టైజ్‌ మెంట్‌ వచ్చేది.  పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే...బాబు ముఖ్యమంత్రి అవ్వాలని అడ్వర్టైజ్‌మెంట్‌ వచ్చేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అందరూ...బాబు మాట విని రుణాలు కట్టడం మానేశారు. దీంతో  ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ లో ఉన్న సంఘాలన్నీ సీ గ్రేడ్, డీ గ్రేడ్‌ కి పడిపోయాయి. పొదుపు సంఘాలన్నీ కూడా 18 శాతం ఎన్‌ పీఏలు, ఔట్‌ స్టాండింగ్‌ గా నిలిచిపోయి, విలవిలలాడిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ పొదుపు సంఘాలకు అప్పటివరకూ ఉన్న సున్నావడ్డీ పథకం కూడా పూర్తిగా ఎత్తేశాడు.

బాబు ఆ అక్కచెల్లెమ్మలను ఇబ్బంది పాలు జేస్తే.. ఆ ఇబ్బందుల్లోంచి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఒక మంచి అన్నయ్య, మంచి తమ్ముడుగా మీ బిడ్డ రూపంలో ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాడు. పొదుపు సంఘాల మహిళలకు తోడుగా నిలబడ్డాడు. చంద్రబాబు వల్ల నష్టపోయిన పొదపు సంఘాలకు వైయస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి ద్వారా ఆదుకోగలిగాడు. వాళ్లంతా ఇవాళ ఈరోజు అక్కచెల్లెమ్మలంతా ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ గా చలామణీ అవుతున్నాయి. అక్కచెల్లెమ్మలు వస్తున్నారంటే... బ్యాంకు మేనేజర్లు అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ కొట్టి లోన్లు ఇచ్చే కార్యక్రమాలు మీ బిడ్డ హయాంలో జరుగుతోంది. 

అప్పట్లో 18శాతంగా ఉన్న ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌ రుమాలు ఇవాళ  కేవలం పాయింట్‌ .03 శాతం మాత్రమే ఎన్‌ పీఏలు, ఔట్‌ స్టాండింగ్‌ లుగా తలెత్తుకునే పరిస్థితుల్లో పొదుపు సంఘాలు  రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఈ రోజు మన అక్కచెల్లెమ్మల వైపు చూస్తోంది. ఆంధ్రరాష్ట్రంలో పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలకు ఇంతి మంచి ఎలా చేయగలిగిందీ, ఇంత మార్పు ఎలా వచ్చిందని దేశమంతా మనవైపు చూస్తోంది.

అప్పట్లో చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలు, పేద వాడి గురించి ఆలోచన చేసిన వారు ఎవరూ లేరు.  కనీసం పేద వాడికి, అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలం కూడా ఒక్క సెంటైనా ఇచ్చిన పాపాన పోలేదు. 

31 లక్షల మందికి ఇళ్లపట్టాలిస్తూ....
 ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్లీ ఆ అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు నేరుగా నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. 10 వేలు కాదు, 20 వేలు కాదు, లక్ష కాదు.. ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. అంటే దాదాపుగా కనీసం ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకుంటే  కోటి మంది ప్రజలకు ఇంటి పట్టాలు పొందిన పరిస్థితి ఉంది. అంతే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో వేగంగా కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 

జాబు రావాలంటే..
ఆలోచన చేయండి. ఇదే పెద్దమనిషి అప్పట్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా ? జాబు రావాలాంటే బాబు రావాలి అని మాట్లాడాడు. ఒక వేళ జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టారు.   బాబు సీఎం అయ్యి చివరకు పిల్లలను సైతం మోసం చేశాడు. 

మన ప్రభుత్వంలో 2.07 లక్షల కొత్త ఉద్యోగాలు...
ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి  అయ్యాడు.  స్వాతంత్య్రం వచ్చాక మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే నాలుగేళ్ల పాలనలో ఏకంగా 2.07 లక్షల ఉద్యోగాలు మీ బిడ్డ యాడ్‌ చేశాడు. 
అంతే కాకుండా వాటిలో నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీ వర్గాల వారికి వచ్చిన ఉద్యోగాలు 80 శాతం ఉన్నాయి.  

గడప వద్దకే ప్రభుత్వ సేవలు...
గతంలో ఏ పౌర సేవ కావాలన్నా... ఒక పెన్షన్, రేషన్, ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులరిగేలా తిరుగుతూ, అవస్థలు పడుతున్న రోజులు గుర్తుకొస్తున్నాయా? 

అప్పట్లో చంద్రబాబు హయాంలో రైతులకు ఎరువులు, పురుగుమందులు కావాలంటే తెల్లవారకముందే మండల కేంద్రాలకు వెళ్లి అక్కడ క్యూలో నిలబడి, ఎండనక, వాననక, చలి అనక మనుషులు చనిపోతున్నా పట్టించుకోని పాలన.  

మీ బిడ్డ పాలనలో ఈరోజు అవన్నీ కూడా మన గ్రామం వద్దకే, మన గడప వద్దకే, మన ఇంటి వద్దకే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు వచ్చి చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. 

చంద్రబాబు - ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యం...
అప్పట్లో చంద్రబాబునాయుడు హయాంలో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలన్న ఆలోచనలతో పరిపాలన సాగింది. రాష్ట్రంలో 108, 104 వాహనాలకు కనీసం డీజిల్‌ ఖర్చులు ఇవ్వడానికి వెనకాడే పరిస్థితి. తేడా ఈరోజు గమనించండి. మీ బిడ్డ పాలన వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏకంగా 18 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు కడుతున్న పరిస్థితి. ఇక్కడే ఆదోనిలోనే ఒక మెడికల్‌ కాలేజీ మొట్టమొదటి సారి కడుతున్న పరిస్థితి. ఏకంగా 1,600 కొత్త వాహనాలు 104, 108 వాహనాలను కొనుగోలు చేసి ప్రతి పేదవాడికీ తోడుగా ఉండేట్లుగా ఏర్పాటు చేశాం. అప్పట్లో కేవలం 1000 రోగాలకు పరిమితమైన ఆరోగ్యశ్రీని ఇవాళ 3,300 రోగాలకు విస్తరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు  ఆ పేషెంట్‌ ఏదైనా ఆపరేషన్‌ చేసుకుని ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్లి పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉంటాడని... ఎన్ని నెలలైనా నెలకు రూ.5 వేల చొప్పున రెస్ట్‌ కోసం ఆరోగ్య ఆసరా తీసుకొచ్చాం. ఇది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోంది. 

గ్రామాల్లోనూ సమూల మార్పులు...
ఇవాళ గ్రామ, గ్రామాన విలేజ్‌ క్లినిక్లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కనిపిస్తోంది. ఈ సేవలన్నింటికీ తోడు జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి ఇంటికీ వచ్చి జల్లెడ పడుతూ మందులు, టెస్టులు,  చికిత్సలు ఉచితంగా చేయడం కోసం మిమ్నల్ని చేయిపట్టుకుని నడిపించే పరిపాలన కూడా  మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోంది. 
మన నిరుపేదలందరూ అంటే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెళ్లేది ప్రభుత్వ స్కూళ్లకే. అటువంటి స్కూళ్లను తెలుగు మీడియంకే పరిమితం చేసి నారాయణ, చైతన్య స్కూళ్లను పెంచి పోషించి పేదవాడిని అమ్మేసిన పరిస్థితి చంద్రబాబు హయాంలో జరిగింది. 

చదువుల విప్లవం....
ఈరోజు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,పేద వర్గాల పిల్లలు బాగా చదవాలని నాడు–నేడు ద్వారా వాళ్ల గురించి ఆలోచన చేసి గవర్నమెంట్‌ బడులన్నీ రూపురేఖలన్నీ మారుతున్నాయి.  6వ తరగతి నుంచి పైతరగతులన్నీ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ఫ్యానెల్స్‌తో డిజిటలైజేషన్‌ చేస్తున్నాం.  8వ తరగతికి వచ్చే సరికి ప్రతి పేదవిద్యార్దిని చేయిపట్టుకుని నడిపిస్తూ..  పిల్లలందరికీ ట్యాబ్‌ లు ఇస్తున్న పరిపాలన జరుగుతోంది. పిల్లలు స్కూలుకు సంతోషంగా వెళ్లాలి. బాగా చదువుకోవాలని రోజుకో మెనూతో గోరుముద్ద అమలవుతోంది.  స్కూళ్లు తెరిచే సమయానికే పిల్లల కోసం ఆలోచన చేసి.. వారి కోసం విద్యా కానుక కిట్టు ఇస్తున్నాం. 

మొట్టమొదటిసారిగా బైజూస్‌ కంటెంట్‌ తీసుకొచ్చాం. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ ఈ తీసుకొచ్చాం. ఐబీ సిలబస్‌ దిశగా అడుగులు వేస్తున్నాం.  బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు కూడా ఈరోజు మన ప్రభుత్వ బడులలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వంలోనే వచ్చాయి.

గతానికీ, ఇప్పటికీ తేడా గమనించండి. గతంలో పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. పైగా పేద వాడిని అహంకారధోరణి, పెత్తందారీ మనస్తత్వంతో అవమానించిన రోజులు ఉన్నాయి.

గతంలో ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు నాయుడు అన్న మాటలు గుర్తున్నాయా ? 
బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దార్‌ అని చంద్రబాబు అన్న మాటలు గుర్తున్నాయా? 
అప్పట్లో అక్కచెల్లెమ్మలనూ సైతం అవహేళన చేస్తూ... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ఆడ పిల్లలను అవహేళన చేసినది గుర్తుందా? 

ఈరోజు పేద వాడు చంద్రబాబు నాయుడుగారి రాజధాని నగరం అని పేరు పెట్టుకున్నాడో, అక్కడ ఇళ్ల స్థలాలను ఇస్తే అడ్డు తగులుతూ కోర్టులకు వెెళ్లారు. డెమోగ్రాఫికల్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని నిస్సిగ్గుగా పేద వాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లిన కేసులు వేసిన పరిస్థితి.   ఇటువంటి పెద్ద మనిషి ఒకవైపు, మరోవైపు మీ బిడ్డ ఉన్నాడు. 

మీ బిడ్డ నోరు తెరిస్తే, ప్రతి మీటింగులో, ప్రతి చోటా అనే మాట నా ఎస్సీ, నాఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వాడు అంటూ తోడుగా ప్రభుత్వం ఉందని ప్రతి అడుగులోనూ భరోసా ఇస్తూ, ప్రేమ, బాధ్యత చూపుతున్న ప్రభుత్వం మనది. 

రాబోయేది కురుక్షేత్ర యుద్ధం...
వీళ్లద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. రాబోయేది, జరగబోయేది కురుక్షేత్రయుద్ధం. రాబోయే యుద్ధం కులాల మధ్య కాదు, క్లాస్‌ వార్‌. పేద వాడు ఒకవైపు, పెత్తందారు మరొకవైపున ఉండి యుద్ధం జరగబోతోంది. ఆలోచన చేయాలని, గమనించమని కోరుతున్నాను.మీ బిడ్డకు అరడజను టీవీ చానళ్ల సపోర్ట్‌ లేదు.  ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి అండ తోడు ఉండదు. 

రేపు జరగబోయే కురక్షేత్ర సంగ్రామంలో కౌరవులు అందరూ ఏకమవుతారు. తోడేళ్లందరూ ఏకమవుతారు.  కానీ మీ బిడ్డకు ఉన్నది పైన దేవుడి దయ, మీ చల్లని దీవెనలు తప్ప ఏదీ లేదు. మీ బిడ్డ పైన దేవుడిని, మిమ్నిల్ని తప్ప మరెవ్వరినీ నమ్ముకోలేదు. రేపు జరగబోయే కురుక్షేత్రంలో టు వేయడానికి వెళ్లేటప్పుడు ఒక్కటేఆలోచన చేయండి. వీళ్లు చెప్పే మోసాలను నమ్మకండి. అబద్దాలను నమ్మకండి. ఒక్కటే కొలమానంగా తీసుకొండి.  మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.  మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి. దేవుడి చల్లని దీవెనలు, ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, దాని వల్ల ప్రతి పేద వాడికీ మంచి చేసే అవకాశం, పరిస్థితులు మరింతగా మీ బిడ్డకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

చివరిగా...
కాసేపటి క్రితం ఎమ్మెల్యే చెన్నవకేశవరెడ్డి మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టుకు, గొనగొండ, ఆలూరు, పత్తికొండకు కనెక్టివిటీ, హంద్రీనీవా నదిపైన రూ.47 కోట్లు ఖర్చయ్యే హైలెవెల్‌ బ్రిడ్జి అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. మరింత మంచి చేసే పరిస్థితులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

మరిన్ని వార్తలు