Pawan Kalyan: పక్కలో బల్లెం

28 Mar, 2024 08:52 IST|Sakshi

పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్‌ కల్యాణ్‌పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్‌ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్‌ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్‌ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్‌ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది.

గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్‌ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్‌ఖాన్‌, బుద్దా వెంకన్నలు ఎవరికివారే  ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్‌ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది.  

మొదటిసారి.. 
పొత్తులో భాగంగా జనసేనకు టికెట్‌ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్‌ఖాన్‌ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడ వెస్ట్‌ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్‌ జలీల్‌ఖాన్‌తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. 

పోతిన మహేష్‌ విజయవాడ వెస్ట్‌ టికెట్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్‌ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్‌ భావించారు.  రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్‌ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. 

రెండోసారి.. 
కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్‌పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్‌ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్‌.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. టికెట్‌పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్‌ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్‌ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్‌ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. 

బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్‌
విజయవాడ వెస్ట్‌ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ మాట్లాడుతూ.. వెస్ట్‌ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్‌ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్‌ మళ్లీ ఆందోళనకు దిగారు. 

అయినా నమ్మకమే!
ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్‌ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్‌ సీటు ఖాయం అని పవన్‌ కల్యాణ్‌ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్‌సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్‌సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. 

ఒకవేళ పవన్‌ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్‌ ఇస్తే రెబల్‌గా పోటీ చేస్తా.. అదీ పవన్‌ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. 

మూడోసారీ.. 
చివరకు విజయవాడ వెస్ట్‌లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్‌ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్‌ సీటుపై పోతిన వెంకట మహేష్‌ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్‌ను పిలిపించుకున్న పవన్‌.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్‌ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. 

పవన్‌ వల్ల నిజంగా కాలేదా?
కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్‌కు.. పవన్‌ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్‌.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్‌.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా  జంప్‌జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్‌..  విజయవాడ వెస్ట్‌ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్‌కు టికెట్‌ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్‌కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

బాబు పాచికేనా?
విజయవాడ వెస్ట్‌ టికెట్‌ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?.  వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా..  సుజనా చౌదరికే టికెట్‌ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్‌ నియోజక వర్గం టికెట్‌ దక్కేలా చేశారనే టాక్‌ బలంగా వినిపిస్తోందిప్పుడు.

Election 2024

మరిన్ని వార్తలు