జన సునామీ.. మండుటెండలోనూ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం | Sakshi
Sakshi News home page

జన సునామీ.. మండుటెండలోనూ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం

Published Mon, Apr 8 2024 5:02 AM

Cm Ys Jagan Memantha Siddham Bus Yatra in Prakasam District - Sakshi

మండుటెండలోనూ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం

ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్‌..

సార్వత్రిక ఎన్నికల వేళ జన సునామీని సృష్టిస్తున్న వైఎస్సార్‌సీపీ

జగన్‌ కోసం ఏ సంగ్రామానికైనా సిద్ధమంటూ గర్జించిన ప్రజానీకం

జనజాతరను తలపించిన ప్రకాశం జిల్లాలోని కొనకమెట్ల బహిరంగ సభ

ఊరూరా పూలవర్షం.. గజమాల తోరణాలతో సీఎంకు ఘన స్వాగతం

అభిమాన నేతకు గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు

ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం వైఎస్‌ జగన్‌

మేమే స్టార్‌ క్యాంపెయినర్లం అంటూ హోరెత్తించిన లబ్ధిదారులు

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆదివారం 46 డిగ్రీల మం­డుటెండలోనూ జన జాతర హోరెత్తింది. ఊరూ–వాడా ఏకమై తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలకగా.. వేసవి తాపాన్ని లెక్కచే­యక చిన్నా, పెద్దా వెంట నడిచింది.  కొనకనమిట్ల జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలోనూ తమ అభిమాన నేతను చూసేందుకు జన సంద్రం ఉవ్వెత్తున ఎగిసిపడింది.

బాబు మోసాలను ఎండగడుతూ సీఎం జగన్‌ ‘రైతు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేలు వేశాడా? ఇంటింటికీ ఉద్యోగం, లేకుంటే నిరుద్యో భృతి ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చాడా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టాడా? ఏపీని సింగపూర్‌ చేశాడా? హోదా తీసుకొచ్చాడా? వీటిల్లో ఒక్కటైనా అమలు చేశాడా? లేదా?’ అని ప్రశ్నించగానే ప్రజలు లేదు..లేదు.. అంటూ రెండు చేతులు పైకెత్తి గళమెత్తారు. యుద్ధ నినాదమై గర్జించారు.

తనకు ప్రజలే అజెండా అని.. జెండాలు జట్టుకట్టిన ప్రతిపక్షాలు బూటకపు హామీలను నమ్ముతారా? అనగానే బాబును నమ్మేది లేదంటూ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ధ్వనించిన జననినాదానికి దిక్కులు పిక్కటిల్లాయి. ధర్మాన్ని కాపాడుతూ.. విశ్వసనీయతకు నీరాజనం పట్టేందుకు, పేదలకు.. చంద్రబాబు కుట్రలకు మధ్య జరిగే యుద్ధానికి సిద్ధమా? అని పిలుపివ్వగానే.. మేమంతా సిద్ధమే అంటూ అశేష జనవాహిని నినదించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆది­వారం పదో రోజుకు చేరుకుంది.  ప్రకాశం జిల్లాలో సూ­ర్యుడి భగభగలను సైతం ఎదురించి జైత్ర యాత్రలా కొనసాగింది. జువ్విగుంట బస శిబిరం నుంచి ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభం కాగా.. ఉదయం నుంచే రోడ్లపై జనాలు బారులు తీరారు. అంతకు ముందు తనను కలిసిన కొండెపి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు సీఎం జగన్‌ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.

వేకువ జామునే ఉదయించిన అభిమానం..
జువ్విగుంట శిబిరం వద్ద సీఎం జగన్‌ యాత్ర అప్పటికే వేచి ఉన్న జనవాహినిలో నుంచి రోడ్డుపైకి వచ్చింది. కూతవేటు దూరంలోనే రాజుపాలెంలో ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. భారీ గజమాల తోరణా­లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ట్రాక్టర్లో బంతిపూలు తరలించి రోడ్డుపై ప్రజలు విరిబాటగా పరి­చారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని కె.అగ్ర­హా­రంలో యువత పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి జన­నేత రాకను నలుదిక్కులా చాటి చెప్పారు. ఎండలోనూ సీఎం జగన్‌ అశేష జనవాహినికి నమస్క­రించారు. రాత్రి బస శిబిరం నుంచి 4 కిలో మీ­టర్ల దూరంలోని కె.అగ్రహా­రా­నికి యాత్ర చేరుకోవ­డానికి దాదాపు గంటపైనే సమ­యం పట్టింది.

షెడ్యూల్‌­లో లేని పాయింట్ల వద్ద కూడా తమ బాధలు చెప్పు­కునేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల, మహి­ళ­లను సీఎం జగన్‌ ఆప్యాయంగా పలక­రిస్తూ నెమ్మదిగా ముందుకు సా­గారు. పర్చూరి­వారిపాలెం, పాలేటి  గంగమ్మ­తల్లి సెంటర్‌లో రోడ్డుకిరు­వైపులా మహిళలు పూల­వర్షం కురిపించారు. అంతటి ఎండలోనూ బస్సు దిగివచ్చిన సీఎం ఓ దివ్యాంగుడి బాధను విని సమస్య పరిష్కా­రా­నికి ఆదేశించారు. రామాపురంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ సేవలపై సీఎం ప్రజలను ఆరా తీశారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి ఆశీర్వదించారు. 

మాస్‌ క్రౌడ్‌ పుల్లర్‌..
సీఎం వైఎస్‌ జగన్‌ సభలకు వస్తున్న అశేష జన­ప్రవా­హాన్ని చూసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎ­స్సార్‌సీపీ సునామీని సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అందుకే.. జగన్‌ను మాస్‌ క్రౌడ్‌ పుల్లర్‌గా అభివర్ణిస్తు­న్నారు. కొనకనమిట్ల బహిరంగ సభకు మేము సిద్ధం అంటూ జిల్లా నలుమూలల నుంచి వైఎ­స్సార్‌సీపీ అభిమానులు, లబ్ధిదారులు పెద్ద ఎ­త్తున తరలివచ్చారు. ఉదయం 11 గంటల కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదికకు సమీపంలో రోడ్లపై మహిళలు, యువత సీఎం జగన్‌ను అనుకరిస్తూ కనిపించారు.

ప్రకాశం జిల్లాలోని కర్నూలు జాతీయ రహదారి పొడవునా అభిమానం కట్టలు తెచ్చుకుంది. సాయంత్రం భోజన విరామ శిబిరం నుంచి 4.20 గంటలకు బయలు దేరిన సీఎం జగన్‌ 5.05 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. 5.15 గంటలకు ర్యాంప్‌ వాక్‌ చేస్తూ ప్రజలకు అభి­వాదం చేశారు. అనంతరం 6.20 గంటల వరకు తన ప్రసంగంలో చంద్రబాబు కుట్రలపై నిప్పు­లు చెరిగారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రజలకు గెలిపించాలని కోరారు.

పొద్దు పోయినా.. 
సాయంత్రం 6.30 గంటల తర్వాత బహిరంగ సభ నుంచి బత్తువారి పల్లి, సలకనూతల క్రాస్‌ మీదుగా పొదిలి చేరుకున్న సీఎంకు అపూర్వ స్వాగతం లభించింది. రాత్రి 7 గంటల సమయంలోనూ ప్రజలు రోడ్లపై జననేత కోసం ఎదురు చూశారు. అనంతరం రాజంపల్లిలో మేళతాళాలు, గజమాల తోరణాలతో సీఎంను ఆహ్వానించారు. అక్కడి ఉంచి దర్శి ఎంట్రన్స్‌కు చేరుకోవడానికి రాత్రి 9.30 గంటలు దాటింది. దర్శిలో నాయ­కుల భారీ స్వాగత ఏర్పాట్ల మధ్య తరలివచ్చిన జనసందోహానికి రోడ్‌షోలో అభివాదం చేస్తూ సీఎం జగన్‌ ముందుకు కదిలారు. అనంతరం 10.20 గంటలకు వెంకటాచలం పల్లిలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.

కదంతొక్కిన కనిగిరి..
తలపై చెంగు, టోపీలు ధరించి మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్‌ రోడ్‌ షోకు హాజరయ్యారు. కనిగిరి మెయిన్‌ రోడ్డుపై సెగలు పుడుతు­న్నప్పటికీ అభిమానం ఎగిసిపడింది. రెండు గంటలకు అశేష జనవాహిని మధ్య సీఎం జగన్‌ రోడ్‌ షో చేశారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. చిన్నా­రులు, విద్యార్థులతో షేక్‌ హ్యాండ్స్, సెల్ఫీలు, ఆత్మీయ పలకరింపులతో సీఎం జగన్‌  ముందుకు సా­గారు. 2.30 గంటలకు నందెలమరెళ్లకి చేరు­కు­న్న సీఎంకు ప్రజలు స్వాగతం పలికారు.  

మావయ్యా.. జగన్‌ మామయ్యా..
సీఎం జగన్‌ బస్సుయాత్ర  ప్రకాశం జిల్లా కనిగిరిలోకి ప్రవేశించింది. చింతలపాలెం ఎస్సీ కాలనీ వద్ద రోడ్డుకు దూరంగా చిన్నారులు, వారి తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ బాలుడు ‘మావయ్యా.. జగన్‌ మామయ్యా’..అంటూ కేకలు వేస్తూ ముందుకు రాగా రోప్‌ పార్టీ అతన్ని అడ్డుకు­న్నారు. గమనించిన జగన్‌ వెళ్తున్న బస్సును ఆపి కిందకు దిగారు. ఆ బాలున్ని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఆత్మీయతపంచారు. అక్కడే ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు పరిగెత్తుకుని జగన్‌ దగ్గరకు వెళ్లారు. వారందరినీ దగ్గరకు తీసుకొని ఆప్యా­యతను చాటారు. చిన్న పిల్లలను తల్లుల చేతిలోంచి తీసుకొని...ఎత్తుకుని లాలించారు. దీంతో కాలనీ­వాసుల్లో అంతులేని ఆనందం నెలకొంది.

కనిగిరి రూరల్‌ 
ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పాదయాత్ర చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం నుంచి భద్రాచలం రామాలయానికి ఆదివారం పాదయాత్రగా వెళ్లారు. మొదట రెడ్డిపాలెం రామాలయంలో, ఆ తర్వాత భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్య­క్రమాలే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు. ఏపీలోని పురుషోత్తపట్నం ఎంపీటీసీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. – బూర్గంపాడు

Advertisement
Advertisement