‘మాఫియా లీడర్లకు, బాహుబలలకు టికెట్‌లు ఇవ్వం’

10 Sep, 2021 21:26 IST|Sakshi

సంచలన ప్రకటన చేసిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి

లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాఫియా లీడర్లకు, బాహుబలులకు టికెట్లు ఇచ్చేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. మావు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఆశించిన గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి పార్టీ టికెట్‌ నిరాకరిస్తూ.. మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. మావు స్థానం నుంచి యూపీ బీఎస్‌పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ పేరు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. 

మావు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్సారీ ప్రస్తుతం బండాలోని జైలులో ఉన్నారు. అంతేకాక ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో 52 కేసులను ఎదుర్కొంటున్నారు. వీటిలో 15 కేసులు విచారణ దశలో ఉన్నాయని ఏఎన్‌ఐ నివేదించింది. వచ్చే  ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ప్రారంభించిన మాయావతి.. ప్రజల ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా శ్రద్ధ వహించాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. 
(చదవండి: చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు)

దీనిపై శుక్రవారం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ నుంచి మాఫియా నేపథ్యం ఉన్నవారు బాహుబలులు ఎవరూ పోటీ చేయరు. దీనిని దృష్టిలో ఉంచుకుని మావు నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీని తొలగించి యూపీ బీఎస్‌పీ అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్‌ను ఖరారు చేశాం. ప్రజల అంచనాలను చేరుకోవాడానికి పార్టీ అందుకునే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని పార్టీ ఇంచార్జీకి విజ్ఞప్తి చేశాను. సమస్యలు లేకుండా ఇటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చట్టం ద్వారా నిర్మితమైన చట్టబద్ధ పాలన కావాలని బీఎస్‌పీ సంకల్పిస్తోంది. యూపీ ప్రస్తుత చిత్రాన్ని మార్చడానికి బీఎస్‌పీ కృషి చేస్తుంది. బీఎస్‌పీ ఏం చెప్పినా చేసి చూపిస్తుంది. అదే మా పార్టీకి నిజమైన గుర్తింపు’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.

చదవండి: బుజ్జగింపులో వింత కోణం

మరిన్ని వార్తలు