మోదీ వ్యాఖ్యలతో.. బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్‌

4 Oct, 2023 12:54 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కేసీఆర్‌ కుటంబంలో లొల్లి మొదలైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయడంతో బీఆర్‌ఎస్‌లో చీలికలు మొదలయ్యాయని అన్నారు. ఈ మేరకు కరీంనగర్‌లో బుధవారం ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ భ్రష్టు పట్టడానికి కేటీఆర్‌ అహంకార వైఖరి, మాటతీరే ప్రధాన కారణమని ఆరోపించారు.  

ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా?
గత 15 రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కనిపించడం లేదని, కేసీఆర్‌ మిస్సింగ్‌ తమను ఆందోళనకు గురిచేస్తోందని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ దగ్గరకు ఎవరనీ వెళ్లనీయడం లేదని, చివరికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ను కూడా దూరం పెట్టారని విమర్శించారు. సీఎం కనిపించకపోవడానికి కొడుకు కేటీఆర్ సతాయింపే కారణమా అనేది బహిర్గతం కావాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ సభలో చేసిన మోదీ వ్యాఖ్యలపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2009లో ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా అని నిలదీశారు.

అప్పుడు, ఇప్పుడూ మీ ఆస్తులెంత!
‘ఉద్యమ సమయంలో తండ్రిని చంపేస్తారా మాకేమొస్తుందని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు జై తెలంగాణా అని మంత్రి పదవిలో కూర్చుండు. ఇంతకంటే చీటర్ ఇంకెవరుంటారు. ఉద్యమ సమయంలో మీ ఆస్తులెంత..? ఇప్పుడు మీ ఆస్తులెంత..? తెలంగాణా సమాజం కేసీఆర్ కుటుంబం ఆస్తులు కొల్లగొడుతున్న విధానాన్ని గమనించాలి’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.
చదవండి: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

మోదీ చెప్పింది అంతా నిజమే
కేసీఆర్ కలిసిన డేట్స్‌తో సహా ప్రధాని మోదీ వెల్లడించారని  బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కేసీఆర్‌తో బీజేపీ ఎప్పుడు కలవదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని అనేకసార్లు బయటపడిందన్నారు.కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో జాయిన్ అవుతారని అన్నారు. ప్రధాని పర్యటనలకు రాకుండా కేసిఆర్ ప్రోటోకాల్ పక్కనే పెట్టేశాడని విమర్శించారు. మోదీ చెప్పింది అంతా నిజమేనని, కేసీఆర్‌ ఎన్డీయేలో కలవాలని మోదీని కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు