Bapatla MP Seat: తెలంగాణ కృష్ణప్రసాద్‌కు ఎంపీ సీటుపచ్చ నేతలు హాట్‌..హాట్‌

26 Mar, 2024 13:40 IST|Sakshi

చీరాల: ఎంతో ఘన చరిత్ర కలిగిన బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొదటిసారి టీడీపీ ఎంపీ అభ్యర్థి సీటును తెలంగాణకు చెందిన టి.కృష్ణప్రసాద్‌కు కేటాయించడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, అభ్యర్థులతో చర్చించకుండా టీడీపీ అధినేత సీటు ప్రకటించారని వాపోతున్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వరంగల్‌ ఎంపీ సీటు ఆశించిన మాజీ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌కు ఇక్కడ కేటాయించడంపై విస్మయానికి గురయ్యారు.

ఉండవల్లి శ్రీదేవికి ఝలక్‌..
తొలుత బాపట్ల ఎంపీ సీటును వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఖరారు చేసినట్లు ప్రచారం జోరుగా జరిగింది. మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, టీడీపీ నేత ఎంఎస్‌ రాజు పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే కృష్ణప్రసాద్‌కు పచ్చ కండువా కప్పి బాపట్ల ఎంపీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిండంపై స్థానిక నేతలు షాకయ్యారు. పార్లమెంట్‌ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలకు చెందిన ఉమ్మడి పార్టీల నాయకులు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీనియర్‌ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

సామాన్యుడికి పట్టంకట్టిన ఓటర్లు
బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం 1977లో ఏర్పడింది. అయితే 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్‌ స్థానంగా కేటాయించారు. బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 ఎన్నికల్లో చీరాల, రేపల్లె, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం బాపట్ల, వేమూరు, ఎస్‌ఎస్‌పాడు నియోజకవర్గాలు వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది. అయినప్పటికీ బాపట్ల ఎంపీగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి సామాన్యుడైన నందిగం సురేష్‌ విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన ప్రజల్లో ఒక కార్యకర్తలాగా తిరుగుతుండటంతో ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి అయిన కృష్ణ ప్రసాద్‌పై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నందిగం సురేష్‌ విజయం నల్లేరుపై నడకలా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ ఎంపీగా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన కృష్ణ ప్రసాద్‌ తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని ఆశించినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు.

ఉద్దండుల కోట
బాపట్ల ఎంపీ సీటు అంటే ఒకప్పుడు రాజకీయ ఉద్దండులు, యోధానుయోధులు, అధిక జనాకర్షణ ఉన్న నేతలు పోటీ చేసే నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేసిన పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలకు అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రులు, ఉప రాష్ట్రపతిగా పని చేసిన ఘనత ఉంది. ముఖ్యంగా గతంలో దేశానికి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ఎం.వెంకయ్యనాయుడు టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మూవీ మొఘల్‌ డాక్టర్‌ రామానాయుడు బాపట్ల ఎంపీగా పోటీచేసి పార్లమెంట్‌ మెట్లెక్కారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్‌ నుంచి బాపట్ల ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎస్సీ నియోజకవర్గం కానప్పటికీ గతంలోనే సలగల బెంజిమెన్‌ వెంకయ్యనాయుడుపై ఎంపీగా గెలిచారు. ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత పనబాక లక్ష్మి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రిగా పనిచేసిన జేడీ శీలం సైతం బాపట్ల పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత శీలం రాజ్యసభకు వెళ్లి కేంద్రమంత్రిగా పనిచేశారు. విశ్రాంత ఐఏఎస్‌లు, ఐఆర్‌ఎస్‌లు సైతం బాపట్ల నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు.

Election 2024

మరిన్ని వార్తలు