డిసెంబర్‌ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ 

11 Nov, 2023 04:47 IST|Sakshi

సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య 

కాచిగూడ (హైదరాబాద్‌): పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు.

బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్‌.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు