చిన్న చిన్న లోపాలు సహజం.. కాళేశ్వరంపై ప్రతిపక్షాలది రాద్ధాంతమే: కేటీఆర్‌

23 Nov, 2023 13:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ తొమ్మిన్నరేళ్లలో తగిన న్యాయం చేసిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ హోటల్‌లో.. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రస్థానం పేరిట మీడియాకు ప్రజంటేషన్‌ ఇచ్చారాయాన. ఈ సందర్భంగా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకూ కేటీఆర్‌ స్పందించారు. 

తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారు. నేడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో తెలంగాణ ఉంది. సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టిన కొత్త ప్రోజెక్ట్ లు కట్టాం. దీంతో తెలంగాణ పల్లెల్లో కరువు పూర్తిగా కనుమరుగు అయ్యింది. శిథిలావస్థలో పాఠశాలలు ప్రస్తుతం కొత్త బడులు కట్టించాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు  తీసుకొచ్చాం. అందరికీ వైద్యం అందుబాటులో ఉంచాం. రైతు బంధు ద్వారా 70 లక్షల మందికి రూ. 73,000  వేల కోట్లు ఇచ్చాం. దేశంలో రైతును  రాజును చేసింది తెలంగాణ కేసీఆర్‌ ప్రభుత్వం. రోజులో 24 గంటల కరెంట్ ఇచ్చేది దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే. రైతు వేడుకలు నిర్మించి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. రైతులకు 5లక్షల రైతు భీమా అందిస్తున్నాం. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అందిస్తాం. ‘పలకతో రండి.. పట్టా పోండి’.. ఇదే  మా విద్యా విధానం.. 

ప్రతిపక్షాల విమర్శలపై.. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను.. అనవసరమైన రాద్ధాంతంగా కొట్టిపారేశారు కేటీఆర్‌. ‘‘సముద్ర మట్టానికి ఎత్తులో నీటిని తీసుకురావటం కష్టమైన పని. అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ తోనే ఎత్తులో ఉన్న తెలంగాణకు నీటిని తీసుకురావాలనే ఆలోచనతోనే కాళేశ్వరం కట్టింది. ప్రాజెక్టులు కట్టాక.. చిన్న చిన్న లోపాలు సహజమే. ప్రతిపక్షాలు వాటి మీద రాద్ధాంతం చేయడం తగదు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదు. అందులో మూడు బ్యారేజ్ లు ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటల నీళ్ళు అందిస్తున్నాం. దాని సామర్థ్యం 160 టీఎంసీలు, పైగా 1,531 కిలోమీటర్ల గ్రావేటి కెనాల్ ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో కట్టిన ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగిన సందర్భాలు అనేకం. కాబట్టి అనవసరంగా విమర్శలు చేయడం సరికాదు. ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు పూర్తి చేస్తాం..  

.. ప్రచారాల్లో ధరణి తీసేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చినట్లే!. ప్రతిపక్షాలు పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణ సమాజం ఇది గమనించాలి..  

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలపై నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నా.  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎవరైనా సరే లెక్కలతో రండి. నేను చర్చకు సిద్దం. గాలి మాటలు మాట్లాడొద్దు. మా ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలిచ్చింది. మొత్తంగా.. నీళ్లు, నిధులు, నియామకాలకు తగిన న్యాయం చేసింది కేసీఆర్‌ సారరథ్యంలోని మా ప్రభుత్వం’’ అని కేటీఆర్‌ ప్రసంగించారు.

మరిన్ని వార్తలు