మా వల్ల కాదు బాబూ.. 

9 Jan, 2024 05:30 IST|Sakshi

సభకు కోట్లు కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? 

టికెట్‌ నాకే ఇస్తున్నట్లు సభలో ప్రకటిస్తామంటేనే ఖర్చు పెట్టుకుంటా 

టీడీపీ అధినేత చంద్రబాబుకు భూమా అఖిలప్రియ అల్టీమేటం 

జన సమీకరణ గురించి పట్టించుకోని వైనం 

నేడు చంద్రబాబు సభ నేపథ్యంలో కేడర్‌లో అయోమయం 

పరువు పోకుండా చూడాలని జిల్లా నేతలు అధిష్టానానికి వినతి 

అఖిల బెదిరింపులకు లొంగమని బాబు స్పష్టికరణ 

పక్క నియోజకవర్గాల నుంచి జనాన్ని రప్పించాలని పెద్దల ఆదేశం

సాక్షి, నంద్యాల : రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేస్తోందా? భూమా అఖిల ప్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అల్టీమేటం జారీ చేశారా? తనకే టికెట్‌ ఇస్తున్నట్లు మంగళవారం నాటి సభలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారా? మరోవైపు ఆమె ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయారా? పార్టీ కోసం కనీస ఖర్చులు సైతం పెట్టుకోలేని స్థితికి చేరుకున్నారా? అనుచరులందరూ చేజారి పోతున్నారా? తన విచిత్ర వైఖరితో అందరినీ దూరం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ స్థానికులు ‘అవును’ అని సమాధానం చెబుతున్నారు.

మంగళవారం (నేడు) పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ సభకు ఏర్పాట్ల విషయంలో ఆ పార్టీ వైఖరి తేటతెల్లమైంది. పార్టీ అధ్యక్షుడు వస్తున్నారంటే టికెట్‌ ఆశిస్తున్న వారు ఎవరైనా జనసమీకరణపైనే దృష్టి పెడతారు. నియోజకవర్గంలో తన బలం చెక్కుచెదరలేదని ఎలాగైనా సరే నిరూపించుకోవడానికి ఎన్ని పాట్లయినా పడతారు. కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు విరుద్ద పరిస్థితి కనిపిస్తోంది.

నేటి సభకు జన సమీకరణ, ప్రజలకు భోజనాలు, తరలింపు ఏర్పాట్లు.. ఇలా ఏమీ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. వాస్తవానికి మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభను నిర్వహించి తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. సభ నిర్వహణకు కనీసం రూ.రెండు కోట్లు ఖర్చవుతుందని, ఆమాత్రం ఖర్చుతో ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.

అయితే ఈ మాత్రం ఖర్చు పెట్టేందుకు కూడా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీనమేషాలు లెక్కిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తనకే టికెట్‌ ఇస్తామని సభలో ప్రకటించాలని డిమాండ్‌ చేసినట్లు తెలియవచ్చింది. అఖిల ఆరి్థక పరిస్థితి, ఇతరత్రా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్న అధిష్టానం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, సభ నిర్వహణ అంతా పార్టీనే చూసుకుంటుందని, ఆ మేరకు జన సమీకరణ ఏర్పాట్లు జిల్లాలోని ఇతర టీడీపీ నేతలకు అప్పగించినట్లు ఆ పారీ్టకి చెందిన ఓ నాయకుడు తెలిపారు.     

జన సమీకరణ ఎలా? 
సభకు అయ్యే ఖర్చు పెట్టుకోలేనని తెగేసి చెప్పిన అఖిలప్రియ.. మరో వైపు ఎలాగైనా టికెట్‌ తనే దక్కించుకోవాలని ప్రయాసపడుతోంది. అయితే ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు తమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలిస్తే ఆ క్రెడిట్‌ అంతా అఖిలప్రియకు దక్కుతుందని.. ఇలా చేస్తే మనకేంటి లాభమని టీడీపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.

సభ విజయవంతమైతే తన వల్లే సభ సక్సెస్‌ అయ్యిందని.. విఫలమైతే ఆ నెపం తమ మీద వేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణ బాధ్యత మీదే కదా అని జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు నేరుగా అఖిలప్రియను ప్రశి్నంచినట్లు సమాచారం. మరోవైపు ఆళ్లగడ్డ టికెట్‌ తమకేనంటూ జనసేన నాయకులు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, ఆళ్లగడ్డ పట్టణంలోని బీబీఆర్‌ పాఠశాల సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న తన స్థలాన్ని పాడు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆళ్లగడ్డ బీజేపీ కన్వినర్‌ భూమా కిశోర్‌ రెడ్డి చెబుతున్నారు.   మరోవైపు భూమా అఖిలప్రియ భర్త భార్గవరాంతో నియోజకవర్గ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఖర్చులను పూర్తిగా తమ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ గురించి పట్టించుకోకుండా.. సభకు ఏవీ సుబ్బారెడ్డి వస్తే బాగోదంటూ భూమా అఖిలప్రియ హెచ్చరించడం కొసమెరుపు.

whatsapp channel

మరిన్ని వార్తలు