CM Nitish Kumar: బీజేపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు.. బీజేపీకి దూరంగా జరుగుతున్న బీహార్‌ సీఎం?

29 Apr, 2022 13:20 IST|Sakshi

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం(ఏప్రిల్‌ 30న) ఢిల్లీలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రుల సమావేశానికి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ డుమ్మా కొట్టనున్నారు. అదీ కావాలనే!. జేడీయూ ఇంకా కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షంగానే ఉందన్న సంగతి తెలిసిందే. అయితే బీహార్‌ రాజకీయాల్లో బీజేపీ, జేడీయూల మధ్య అంతర్గత వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల తీవ్ర వ్యాఖ్యలకు నితీశ్‌ కుమార్‌ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. 

ఈమధ్య బీహార్‌లో ముఖ్యమంత్రిని మార్చేయాలంటూ కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వినయ్‌ బీహారీ ఏకంగా.. నితీశ్‌ను గద్దె నుంచి దించేసి.. ఆ స్థానంలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం తారకిషోర్‌  ప్రసాద్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీజేపీ నేతల తీరుపై తన సన్నిహితుల వద్ద సీఎం నితీశ్‌ కుమార్‌ అసహనం​ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనకు బదులుగా.. పూర్ణిమాలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఆరంభ కార్యక్రమానికి వెళ్లాలని సీఎం నితీశ్‌ నిర్ణయించుకున్నారు. అయితే నితీశ్‌ స్థానంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రిని పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇఫ్తార్‌ విందు సందర్భంగా ఉపముఖ్యమంత్రి తారకిషోర్‌ కంటే ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సన్నిహితంగా ఉన్నారు సీఎం నితీశ్‌ కుమార్‌. దీనిపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేవలం ఆతిథ్య ఉద్దేశంతోనే నితీశ్‌ అలా ప్రవర్తించారంటూ జేడీయూ నేతలు ప్రకటించారు.

కానీ, గత కొన్నిరోజులుగా బీహార్‌ రాజకీయ సమీకరణాలు మరోలా సంకేతాలు ఇస్తున్నాయి. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్‌ను ప్రతిపాదిస్తాయనే పుకారు ఒకటి చక్కర్లు కొట్టగా.. మరోవైపు బీజేపీకి దూరమై ఆర్జేడీకి దగ్గరయ్యే ప్రయత్నంలో నితీశ్‌ కుమార్‌ ఉన్నట్లు బీజేపీ స్థానిక నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

చదవండి: పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి?: సీఎం నితీశ్‌

మరిన్ని వార్తలు