నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ

29 Jan, 2024 08:59 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం సోమవారం తన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అడ్వకేట్‌ జనరల్‌ నామినేషన్‌పై తొలి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశం ఏర్పాట్లపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

బిహార్‌లో మహాఘట్‌బంధన్‌కు నితీష్ కుమార్ ఆదివారం భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిని వదిలి ఎన్డీఏలో చేరారు. సీఎం నితీష్ కుమార్ ఆదివారం రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సీఎం నితీశ్ కుమార్, బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు జేడీయూ నుంచి చెందిన ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజేంద్ర యాదవ్, హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) నేత సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.   

మరో రెండు రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపడతామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. బీహార్ కేబినెట్‌లో గరిష్టంగా 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. నితీష్ కుమార్ మినహా మొత్తం ఎనిమిది మంది మంత్రులు ఆదివారం ప్రమాణం చేశారు. నూతన కేబినెట్‌లో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. అటు ఓబీసీలను ప్రసన్నం చేసుకోవడమే ఎన్డీఏ లక్ష్యంగా కనిపిస్తోంది.

కొత్త కేబినెట్‌లో భూమిహార్ కమ్యూనిటీ నుండి విజయ్ చౌదరి, విజయ్ సిన్హా, రాజ్‌పుత్ కమ్యూనిటీ నుండి సుమిత్ కుమార్ సింగ్ (స్వతంత్ర) సహా ముగ్గురు అగ్రవర్ణాల మంత్రులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో సహా కుర్మీ కులానికి చెందిన జేడీయూ నాయకుడు శ్రవణ్‌కుమార్‌, మహాదళిత్‌ సామాజికవర్గానికి చెందిన సంతోష్‌ కుమార్‌ సుమన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌లో ఇటీవలి కులాల సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో కుర్మీలు 2.8 శాతం ఉన్నారు.

ఇదీ చదవండి: Jharkhand: బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది?

whatsapp channel

మరిన్ని వార్తలు