Jharkhand: బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది?

29 Jan, 2024 07:49 IST|Sakshi

బీహార్‌లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీహార్‌లో గత 15 రోజులుగా కొనసాగిన పొలిటికల్ గేమ్‌కు తెరపడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బీహార్‌లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ నుండి కూడా  ఇటువంటి వార్తలు వెలువడుతున్నాయి. 

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇందుకోసం హేమంత్ సోరెన్ తన నివాసం లేదా ఈడీ కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఇది రాజకీయవర్గాల్లో పలు చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి జనవరి 20న సీఎం హేమంత్ సోరెన్‌ను ఏడున్నర గంటల పాటు విచారించిన ఈడీ..  తదుపరి విచారణకు జనవరి 27 నుంచి 31 మధ్య ఏదో ఒక రోజు చెప్పాలంటూ హేమంత్ సోరెన్‌కు మరోసారి సమన్లు ​​జారీ చేసింది.

వీటిని అందుకున్న సీఎం హేమంత్‌ సోరెన్‌ నుంచి ఈడీకి సమాధానం అందిందని సమాచారం. ఈ నేపధ్యంలో ఈడీ జనవరి 29 లేదా 31వ తేదీల్లో విచారణకు ఒక తేదీని కోరుతూ ప్రత్యుత్తర లేఖ రాసింది. దీనికి స్పందించకపోతే అధికారులే సీఎం ఇంటికి వస్తారని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ అందించిన లేఖలోని స్పష్టతను గమనిస్తే, జార్ఖండ్‌లో అతి త్వరలో రాజకీయ పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు