చంద్రబాబు ఎంగిలి కాఫీలు తాగే రకం!

19 Nov, 2022 08:27 IST|Sakshi

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడుసోము వీర్రాజు ధ్వజం

బాబును ప్రధాని పొగిడారని ఎవరు చెప్పారు? 

ఎవరో చేసినవీ చంద్రబాబు తానే చేశానంటారు

పొదుపు సంఘాలు తెచ్చింది పీవీనే

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎవరో చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకుంటారని, ఆయనో ఎంగిలి కాఫీలు తాగే రకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పొదుపు సంఘాలను తానే ఏర్పాటు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. ప్రధాని కూడా తనను పొగిడారని చెప్పుకుంటున్నారు. ప్రధాని అలా అన్నారని ఆయనకు ఎవరు చెప్పారు? పొదుపు సంఘాలను చంద్రబాబు ఏర్పాటు చేయలేదు.

వాటిని ఏర్పాటు చేసింది దివంగత ప్రధాని పీవీ నరసింహారావు. 1991–95 మధ్య పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో పొదుపు సంఘాల వ్యవస్థను తెచ్చి రివాల్వింగ్‌ ఫండ్‌ మంజూరు విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామంలో ఒక ఎన్జీవో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అందులో చంద్రబాబు ప్రమేయం ఏమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పీవీ వీటిని తీసుకొస్తే..  వాజ్‌పేయి వచ్చాక డ్వాక్రా పేరుతో పట్టణాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు మైక్‌ పట్టుకొని ఊగిపోతున్నారు. అదీ మన తడాఖా అంటున్నారు. ఏం తడాఖా..? అలాంటి వాటినే ఎంగిలి కాఫీలు తాగే రకాలు అంటారు’ అని ధ్వజమెత్తారు.  

ఇక ఇబ్బందులు ఉండవు.. 
బీజేపీ కార్యక్రమాలకు రాష్ట్రంలో పత్రికలు పెద్దగా కవరేజీ ఇవ్వడం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పవన్‌కళ్యాణ్‌ సమావేశం తర్వాత తమ మిత్రపక్షం జనసేన కార్యక్రమాల కవరేజీ కూడా తగ్గించేశారని చెప్పారు. మోదీ, పవన్‌కళ్యాణ్‌ మధ్య పలు అంశాలపై చర్చ జరిగిందని, ఇక రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. బీజేపీ, జనసేన ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి పోరాడతాయన్నారు. పవన్‌కళ్యాణ్‌ కార్యక్రమాలను అధికారపార్టీ నేతలు నిరోధిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ సొమ్ము చర్చిలకు ఎలా కేటాయిస్తారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. 

బీసీలపై టీడీపీ తీరుకు నిదర్శనం: జీవీఎల్‌ 
టీడీపీ పూర్తి అభద్రతా భావంతో ఉందని జీవీఎల్‌ చెప్పారు. టీడీపీ ఏర్పాటు నుంచి పార్టీలో కొనసాగుతున్న యనమల లాంటి వారిని ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వబోమని లోకేశ్‌ ప్రకటించటాన్ని బట్టి బీసీల పట్ల వారి వైఖరి తెలుస్తోందన్నారు. బీజేపీ–జనసేన భాగస్వామ్యంతో 2024లో పొలిటికల్‌ బ్లాక్‌బస్టర్‌ రావడం ఖాయమన్నారు. సాధారణ రోజుల్లో పెద్దగా కనిపించని రూ.2 వేల నోట్లు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెద్దఎత్తున బయటకు రావడంపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం టీడీపీ హయాంలో కూడా రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలోనే ఉందన్నారు. దీనిపై కేంద్ర విమానయాన మంత్రికి లేఖ రాస్తానని తెలిపారు.  

మరిన్ని వార్తలు