తెలంగాణకు మోదీ గ్యారంటీలు

14 Nov, 2023 05:03 IST|Sakshi

పకడ్బందీగా రూపొందుతున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

మోదీ గ్యారంటీల పేరుతో ప్రజలకు భరోసా

ఉచితంగా విద్య, వైద్యం అమలు.. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికి జీవిత బీమా

ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.10 లక్షల దాకా వైద్యం..

వరికి మద్దతు ధర రూ.3,100

మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు

ఈ నెల 17న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌ షా!

అదేరోజు 4 సభలకు హాజరు

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలకు భిన్నంగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీనేతలు చెబుతున్నా రు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ లు, యువత, రైతులు.. ఇలా విభిన్నవర్గాలకు ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. అదనంగా సెంటిమెంట్‌ను జోడించి మరింత ఆకర్షణీయంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ముసాయిదాను నాయకత్వం సమగ్రంగా పరి శీలించిన తర్వాత ఈ నెల 17న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచా రం. రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తర పున ఎన్నికల ప్రచారంకోసం అమిత్‌ షా వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌ లోని మీడియా సెంటర్‌లో బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారని చెపుతున్నారు.

ఈ పర్య టన సందర్భంగా నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్‌ షా పాల్గొంటారని పార్టీ నాయకులు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక, అన్ని సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చాక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని కొనసాగించడంలో భాగంగా ఈ నెల 17న ప్రకటన ఉంటుందని పార్టీ నాయకులు చెపుతున్నారు. 

విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇలా.. 
– అర్హులైన అందరికీ ఉచితంగా విద్య, వైద్యం అమలుకు చర్యలు
– యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు జాబ్‌ కేలెండర్‌
– ప్రతి వ్యక్తికి జీవిత బీమా వర్తింపు
– ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ. 10 లక్షల దాకా ఉచిత వైద్యం 
– వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100 
– వివాహిత మహిళలకు ఏడాదికి రూ.12 వేల భృతి
– వంట గ్యాస్‌ సిలిండర్‌ రూ.500 కే అందించేలా చర్యలు
– తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు 
– రాష్ట్రవ్యాప్తంగా జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ చౌకగా మందులు అందుబాటులోకి తేవడం
– వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 20వేలు చెల్లింపు
– దేవస్థానాలు, తీర్థస్థానాల పర్యాటకానికి ఊతం (రెలీజియస్‌ టూరిజం) 
– ఐఐటీ, ఎయిమ్స్‌ తరహాలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల ఏర్పాటు
– ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు
– ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు
–మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు 
– రెండు పెన్షన్లు (ఇంట్లో వృద్ధులైన భార్యా, భర్తలు ఇద్దరికీ వర్తింపు)
– ప్రమాదవశాత్తు చనిపోతే రైతులకే కాకుండా కౌలు రైతులు, రిక్షాకార్మికులు, ఇతర వర్గాల పేదలకు ప్రమాదబీమా రూ. 5 లక్షలు చెల్లింపు 
– జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు

ప్రజల్లోకి బీసీ సీఎం నినాదం..
బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు.. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటిదాకా సీఎం పదవిని బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి చేపట్టకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని బీజేపీ భావిస్తోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీలు బీసీ నాయకుడిని సీఎం చేసే పరిస్థితే ఉత్పన్నం కాదని, అందుకు భిన్నంగా బీజేపీ జాతీయ నాయకత్వం బీసీ నినాదాన్ని తలకెత్తుకోవడంతో పాటు బీసీ నేతను సీఎంగా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా బీసీ వర్గాల వారు మద్దతు తెలపాలని కోరనుంది. బీసీలకు టికెట్లు కేటాయించే విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు కేవలం మొక్కుబడిగా వ్యవహరిస్తే, బీజేపీ 36 సీట్లు బీసీలకు కేటాయించినందున వచ్చేఎన్నికల్లో ఆదరించాలని కోరనుంది.   

మరిన్ని వార్తలు