అందరి దృష్టి కామారెడ్డిపైనే..

14 Nov, 2023 04:45 IST|Sakshi

ఎస్‌. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి    సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్‌లో కామారెడ్డిలో   బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి  పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి.  కేసీఆర్, రేవంత్‌రెడ్డితోపాటు  బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్‌ ఉంది.  

మూడ్‌ ఎలా ఉంటుందో.. 
సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో  పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్‌ఎస్‌పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను  ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి.  

పేగుబంధం సెంటిమెంట్‌తో కేసీఆర్‌ 
రెండు పర్యాయాలుగా గజ్వేల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్‌ ఈసారి గజ్వేల్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్‌ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్‌ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. 

సర్వేల మీద సర్వేలు... 
ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్‌ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా,  మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి.  

కాటిపల్లి ’లోకల్‌’ 
బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు.  డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్‌ ప్లాన్‌తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు.  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.  

సవాల్‌ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్‌... 
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్‌ విసిరిన రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు.

మరిన్ని వార్తలు