అవినీతిలో నంబర్‌వన్‌

21 Nov, 2023 04:07 IST|Sakshi
సోమవారం జనగామలో బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

తెలంగాణ పథకాలు, మిషన్లు.. కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్లు : అమిత్‌ షా

కాళేశ్వరం, మిషన్‌ భగీరథలో రూ. వేల కోట్లు పక్కదారిపట్టాయి 

రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతిపై విచారణ 

చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో పసుపు బోర్డు 

బైరాన్‌పల్లిలో అమరుల స్మృతి చిహ్నం 

జగిత్యాల జిల్లాలో బీడీ కార్మీకుల కోసం 500 పడకల ప్రత్యేక ఆస్పత్రి 

జనగామ, కోరుట్ల, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ బహిరంగ సభలు

జనగామ/కోరుట్ల/మెట్‌పల్లి/మల్లాపూర్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో మిషన్‌ పథకాలన్నీ కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల స్కీంలుగా మారిపోయాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. అవినీతి ర్యాంకింగ్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా పేరు తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. కొట్లాడి సాధించుకున్న నయా తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడానికి మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు రావడం విచారకరమని పేర్కొన్నారు.

బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో, ఉప్పల్‌ నియోజకవర్గంలోని నాచారంలో నిర్వహించిన రోడ్‌ షోలో అమిత్‌ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ గొప్పగా చెప్పుకునే మిషన్‌ స్కీములన్నీ కమీషన్ల మార్కెట్‌గా మారిపోయాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ఔటర్‌ రింగ్‌రోడ్డు, గ్రానైట్‌ గనులు, మియాపూర్‌ భూములు, కాళేశ్వరం ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరిగింది. కాళేశ్వరంలో రూ.45 వేల కోట్లు, మిషన్‌ కాకతీయలో రూ.24 వేల కోట్లు పక్కదారి పట్టాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను, కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం. 

కుటుంబ పార్టీలను సాగనంపాలి 
దేశంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్న 2జీ బీఆర్‌ఎస్, 3జీ ఎంఐఎం, 4జీ కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు సాగనంపాలి. తరతరాలుగా వారసత్వ పాలన కోసం తండ్లాడే పార్టీలు అవి. అదే బీజేపీ ఎప్పుడూ ప్రజల పార్టీగా నిలబడుతుంది. తెలంగాణలో ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను తొలగించి.. జనాభా ప్రాతిపాదికన బీసీ, ఎస్సీలకు ఇస్తాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుంది. దానికి బీజేపీ కట్టుబడి ఉంది. 

మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి 
ఉక్కు మనిషి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో విముక్తి పొందిన తెలంగాణ.. ఆంధ్రా పాలకుల చేతిలో నలిగిపోయింది. కొట్లాడి సాధించుకున్న నయా తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడానికి మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు రావడం విచారకరం. కేసీఆర్‌ ఎంఐఎం ఓవైసీలకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని విస్మరిస్తున్నారు. మేం అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌ 17న విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. సాయుధ పోరాటం చేపట్టి నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల కర్కశత్వానికి బలైన బైరాన్‌పల్లి ఉద్యమకారులకు జోహార్లు అర్పిస్తూ ఆ గ్రామంలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తాం.
 
అంతర్జాతీయ స్థాయిలో పసుపు బోర్డు 
దేశంలో పసుపు రైతులకు సముచిత న్యాయం చేసేందుకు త్వరలో అంతర్జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం. వరి ధాన్యానికి రూ.3,100 మద్దతుధర ఇస్తాం. ఉచితంగా పంటల బీమా అమలు చేస్తాం. ఉజ్వల పథకం కింద ఏటా ఉచితంగా నాలుగు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం. పేద కుటుంబాలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాల కోసం రూ.2,500 ఇస్తాం. 

ఆ భూకబ్జాదారులకు ఓటేయద్దు 
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ భూకబ్జాదారులు. అలాంటి వారికి ఓటెయ్యకుండా.. దేశాభివృద్ధికి పాటుపడే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి’’ అని అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. 
 
జైశ్రీరామ్‌ నినాదాలతో దద్దరిల్లిన రోడ్‌ షో 
ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన అమిత్‌ షా రోడ్‌షో ఆసాంతం మోదీ.. వందేమాతరం.. జై శ్రీరామ్‌.. నినాదాలతో హోరెత్తింది. దారిపొడవునా భవనాల పైనుంచి ప్రజలు అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతలపై పూలు చల్లారు. అయితే రోడ్‌షోతో మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనాదారులు ఇబ్బంది పడ్డారు. 

మరిన్ని వార్తలు