విశ్వసనీయత కలిగిన నాయకుడు సీఎం జగన్‌

15 Mar, 2024 03:48 IST|Sakshi

ఆయన బాగా కష్టపడి పనిచేస్తున్నారు

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశం ఉంది 

చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తోనూ పొత్తు పెట్టుకున్నారు 

బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు

తిరుపతి లీగల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి విశ్వసనీయత కలిగిన నాయకుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాఖలు చేసిన కేసులో వాదనలు వినిపించేందుకు గురువారం తిరుపతి వచ్చిన సుబ్రమణ్యస్వామి... కోర్టు సముదాయం ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలపై తన అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా... ‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు.

ప్రజల్లో మంచి విశ్వసనీయత గల నాయకుడిగా గుర్తింపు పొందారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని సుబ్రమణ్యస్వామి తెలిపారు. అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల గురించి కూడా ఆయన స్పందన కోరగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో కాంగ్రెస్‌ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.   

ఆంధ్రజ్యోతిపై టీటీడీ పరువు నష్టం కేసు విచారణ 27కి వాయిదా 
ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ దాఖలు చేసిన రూ.వంద కోట్లు పరువునష్టం దావా కేసు విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తిరుపతి పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ గురువారం జరిగింది. ఈ కేసులో టీటీడీ తరఫున గతంలో దాఖలైన రెండు పిటీషన్లపై బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు. టీటీడీ దాఖలు చేసిన పత్రాలను కోర్టు స్వీకరించాలని, అలాగే టీటీడీ తరఫున సాక్ష్యం ఇవ్వడానికి అనుమతిపత్రాన్ని కోర్టు స్వీకరించాలని ఆయన కోరారు.

వాదనల సమ­యంలో ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది లేకపోవడంతో వారి వాదనలు వినడానికి జడ్జి కేసును వాయిదా వేస్తూ డాకెట్‌పై రాశారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాది వచ్చి... ఈ కేసును కొంతసేపు పక్కన పెట్టాలని, ఆంధ్రజ్యోతి తరఫున పిటిషన్‌ దాఖలు చేస్తామని కోరారు. అయితే అప్పటికే కేసును వాయిదా వేయడంతో ఈ నెల 27న ఆంధ్రజ్యోతి తరఫున వాదనలు వినిపించాలని, అలాగే పిటిషన్‌ కూడా అదేరోజు దాఖలు చేయాలని జడ్జి సూచించారు. 

వాయిదాలు తీసుకుంటున్నారు... 
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా ఆంధ్రజ్యోతి పత్రిక 2019, డిసెంబరు ఒకటో తేదీన ప్రచురించిన కథనంపై టీటీడీ దాఖలు చేసిన కేసును తాను వాదించడానికి అర్హత లేదంటూ ఆంధ్రజ్యోతి కోర్టుల్లో వాయిదాలపై వాయిదాలు తీసుకుంటూ వచ్చి0దని సుబ్రమణ్యస్వామి మీడియాతో చెప్పారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులోనూ తాను వాదించడానికి వీల్లేదని పిటిషన్‌ వేయగా, న్యాయస్థానం కొట్టివేసిందని ఆయన గుర్తుచేశారు.

దేశవ్యాప్తంగా తాను పలు కేసులను వాదించానని సుబ్రమణ్యస్వామి చెప్పారు. అయితే, తనకు వాదనలు వినిపించడానికి అర్హత లేదంటూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం వాదించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సుబ్రమణ్యస్వామితోపాటు టీటీడీ న్యాయ సలహాదారుడు యుగంధర్‌రెడ్డి, న్యాయవాది దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు