బీఆర్‌ఎస్‌లోకి రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి 

5 Nov, 2023 05:01 IST|Sakshi
కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరుతున్న రాకేశ్‌రెడ్డి. చిత్రంలో పల్లా, కడియం 

కేటీఆర్‌ సమక్షంలో బీజేపీ నేతల చేరిక 

సాక్షి, హైదరాబాద్‌: కష్టపడి సాధించుకున్న తెలంగాణను మనమే పాలించుకుందామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకం అందని ఇల్లు లేదని, ముఖ్యమంత్రిని తమ ఇంటి పెద్దగా యువత భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ఏనుగు రాకేశ్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్‌ తదితరులు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కేటీఆర్‌ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు, నీళ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేదని విమర్శించారు.

తాము అధికారంలోకి వస్తే వరంగల్‌లో మెట్రోను పరుగులు పెట్టిస్తామని కేటీఆర్‌ హామీఇచ్చారు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్‌ అయితే, భవిష్యత్‌ తెలంగాణ నిర్మాత కేటీఆర్‌ అని కొనియాడారు. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నేతలు ప్రకటించారు.

మరిన్ని వార్తలు