surveys: అధికారం కోసం అనేక సర్వేలు..!

13 Nov, 2023 12:07 IST|Sakshi

ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి అధికారం కాపాడుకోవాలని...ప్రతిపక్షంలో ఉన్నవారికి పవర్‌లోకి రావాలనే కోరిక బలంగా ఉంటుంది. మరి తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది? అధికారంలో ఉన్నవారికి ఇంటెలిజెన్స్‌ విభాగం ఉంటుంది కనుక కొంతవరకు సమాచారం తెలుస్తుంది. మరి ప్రతిపక్షాలకు ప్రజల గురించి ఎలా తెలుస్తుంది? అసలు ప్రజల్ని ప్రభావితం చేసే శక్తులేవి? అధికార, ప్రతిపక్షాలకు ప్రజల మనోగతం ఎలా తెలుస్తుంది?  
సర్వేసంస్థలు మరియు మీడియా సంస్థలు.. 
పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయావర్గాల్లో హడావుడి మొదలవుతుంది. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అధికారులు, శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు, సాయుధ బలగాలు, పోటీ చేసే పార్టీలు, వాటి అభ్యర్థులు, పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు...ప్రజలు ఇలా అన్ని రంగాల్లోనూ విపరీతమైన హడావుడి కనిపిస్తుంది.

కాని ఇదే సమయంలో మరో వర్గం కూడా యాక్టివ్ అవుతుంది. అవే సర్వే సంస్థలు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు స్వయంగాను..కొన్ని సర్వే సంస్థలతో కలిసి జనంలో ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తోందనే అభిప్రాయ సేకరణ చేస్తుంటాయి. కొన్ని సర్వే సంస్థలు ఏ మీడియాతోను సంబంధం లేకుండా తామే స్వయంగా సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తుంటాయి. 

ప్రజల మూడ్‌ తెలుసుకోవడం కోసమే..
మీడియా సంస్థలు, సర్వే సంస్థలు స్వయంగా సర్వే చేయడం ఒక భాగం కాగా...కొన్ని ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలే నేరుగా కొన్ని సర్వే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల ముందు సర్వేలు చేయించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉందనగా సర్వేలు ప్రారంభిస్తున్నాయి. ఎన్నికలు వచ్చే నాటికి పలుసార్లు సర్వేలు చేయించుకుని వాటి ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.

అయితే కొన్ని పార్టీలు రాష్ట్రంలో ఏ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపిస్తున్నారనే అంశాల మీద సర్వే  చేయించి వాటి నివేదికలను ప్రజల్లోకి వదులుతున్నాయి. సహజంగా ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉందనేవిధంగానే సర్వే ఫలితాలు ఇస్తుంటాయి. ఒక రకంగా ప్రజల మూడ్‌ మార్చడం కోసం చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. 

సర్వేల ఓటు బీఆర్‌ఎస్‌కే..
కొన్ని మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల్లో తమకున్న పేరు, ప్రతిష్టలు పోగొట్టుకోకుండా నిక్కచ్చిగా సర్వేలు చేస్తూ వాటి ఫలితాలను కూడా నిస్పక్షపాతంగా ప్రజల ముందుంచుతున్నాయి. ఇక పార్టీల కోసం సర్వే చేసే సంస్థలు ఆయా పార్టీలదే విజయం అన్నట్లుగా...ప్రజలను ప్రభావితం చేయడానికి..అప్పటికి ఇంకా ఎటూ తేల్చుకోని ఓటర్ల అభిప్రాయాన్ని మలచడానికి ప్రయత్నిస్తుంటాయి.

గత ఆరు నెలలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి కొన్ని జాతీయ మీడియా సంస్థలు రకరకాల సర్వేలు నిర్వహించి ఎన్నికల ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో తెలియచేశాయి. ఇప్పటివరకు వెలువడ్డ అన్ని సర్వేలు బీఆర్ఎస్‌కు సీట్లు తగ్గినా మరోసారి అధికారంలోకి వస్తుందని, లేదంటే హంగ్‌ వస్తుందని...అయినప్పటికీ గులాబీ పార్టీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందనే చెబుతున్నాయి. కాని కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఒక్క సర్వే కూడా చెప్పలేదు...ఒకే ఒక సర్వే మాత్రం హంగ్‌లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా వస్తుందని చెప్పింది. కాని బీజేపీ లీడ్‌లో ఉంటుందన్న సర్వే ఒక్కటి కూడా కనిపించలేదు.

ఎవరి సర్వేలు వారికే అనుకూలం...
అయితే పార్టీలు సొంతంగా చేయించుకుని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే సర్వేలు మాత్రం ఆయా పార్టీలకు అనుకూలంగా ఉంటున్నాయి. మెజారిటీ ప్రజలు ఏదో ఒక పార్టీవైపు మొగ్గు చూపిస్తుంటారు. కాని కొంత మంది ప్రజలు ఎటూ తేల్చుకోలేక పోలింగ్ తేదీ నాడు ఏదో ఒక గుర్తు మీద ఓటేస్తుంటారు. అటువంటి వారిని ప్రభావితం చేయడానికే రాజకీయ పార్టీలు సర్వే సంస్థల్ని వినియోగించుకుంటాయి. ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తారో..ఏ సర్వే సంస్థ చెప్పినవి నిజమవుతాయో తెలియాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే. 
 

మరిన్ని వార్తలు