రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా రాజీనామా

4 Mar, 2024 21:23 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(63) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా..  ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్‌ నుంచి నామినేషన్‌ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన హిమాచల్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి రాజ్యసభ చైర్మన్‌ ఆమోదం లభించింది. 

బీహార్‌లో పుట్టి పెరిగిన జగత్‌ ప్రకాష్‌(జేపీ) నడ్డా.. నరేంద్ర మోదీకి సహచరుడు. లాయర్‌గా కెరీర్‌ను ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన పూర్వ మూలాలు మాత్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి. అందుకే 1993 నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నెగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన  ఆ రాష్ట్రానికి పలు శాఖల మంత్రిగానూ పని చేశారు. 2012లో హిమాచల్‌ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. పెద్దల సభకు వెళ్లాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

.. 2014 నుంచి 2019 నడుమ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2019 జూన్‌లో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2020, జనవరి 20వ తేదీ నుంచి ఆయన బీజేపీ జాతీయాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2022లోనే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. బీజేపీ అధిష్టానం కాలపరిమితిని పొడగించింది. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

whatsapp channel

మరిన్ని వార్తలు