బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!

31 Oct, 2021 08:36 IST|Sakshi

రెండు రోజుల హైడ్రామాకు తెర 

30ఏళ్లలో ఎప్పుడూ లేనట్టుగా చిన్న చిన్న వీధుల్లోనూ తిరిగిన బాబు 

ఖర్చు లెక్కలు వేసుకుంటున్న టీడీపీ నేతలు 

ఇంత చేసినా మున్సిపాలిటీ ఎన్నికలకు పనికొచ్చేనా అని విశ్లేషణలు 

ఎప్పుడూ లేనంతగా ఆవేశంతో ఊగిపోవడం.. ఎక్కడికక్కడ గంటల తరబడి ఉపన్యాసాలు.. ఒంగి ఒంగి దండాలు.. మీ రుణం తీర్చుకోలేనంటూ సెంటిమెంట్‌ డైలాగులు.. ఇలా రెండురోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ప్రజలకు తన విన్యాసాలు చూపించారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. బాబు భాషలో తమ్ముళ్లు.. రెండురోజులూ ఫూటుగా ఫుల్‌ బాటిళ్లు కొట్టేసి.. ఎక్కడికక్కడ తూగిపోతూ ఏం మాట్లాడుతున్నారో తెలియనంత మత్తులో మునిగితేలారు. మధ్యలో టీడీపీ నేతలు మాత్రం ఈ రెండు రోజుల బాబు టూర్‌కి ఎంత ఖర్చయింది.. ఇంత చేసినా వచ్చే మున్సిపల్‌ ఎన్నికలకు ఈ పర్యటన ఏమైనా కలిసొస్తుందా.. లేదా అనవసర యాగీ వల్ల వచ్చే నాలుగు ఓట్లు కూడా పోతాయా.. అని లెక్కలు వేసుకుంటూ కనిపించారు. స్థూలంగా చెప్పాలంటే రెండు రోజుల కుప్పం పర్యటనలో బాబు ఆవేశం పేరిట ఆయాసం తప్ప ఫలితం ఏమీ కానరాదని కుప్పంలోని టీడీపీ సీనియర్లే విశ్లేషించుకుంటున్నారు.

సాక్షి, తిరుపతి: ‘‘థూ.. అవి ఫలితాలా.. ’ దేశంలో నేనే సీనియర్‌ రాజకీయ నేత అని చెప్పుకునే చంద్రబాబు నోటి వెంట వచ్చిన ముత్యపు పలుకది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. అసలు అవి ఎన్నికలే కాదని, వాటికి మేము దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కానీ త్వరలో జరగనున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు మాత్రం ఆ విధంగా చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడో కూడా తెలియకుండానే బాబు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఉనికి కాపాడుకోవడమే లక్ష్యంగా శుక్ర, శనివారాల్లో రాజకీయం చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఈ మున్సిపాలిటీ ఎన్నిక ఫలితాలు మనకు చాలా ఇంపార్టెంట్‌ అని దిశానిర్దేశం చేశారు.

 

రండి.. బాబూ రండి.. 
తొలిరోజు శుక్రవారం నాటి సభకు ఓ మాదిరిగానైనా జనాలను తరలించిన ద్వితీయ శ్రేణి నేతలు రెండో రోజు శనివారం చేతులెత్తేశారు. బాబు టూర్‌లో శనివారం ఉదయం జనం చాలా పలుచగా కనిపించారు. దీంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.. అందరి ఫోన్లకి మెసేజ్‌లు, వాట్సాప్‌లు పంపించారు. ఇవాళ జనం పెద్దగా లేరు.. వైఎస్సార్‌సీపీ నేతలు బాబు గారిని అడ్డుకునే అవకాశం ఉంది.. అందుకని మీరు బేగా వచ్చేయండి.. అద్దె జనాలను తీసుకురండి అని మెసేజ్‌లు దంచి కొట్టారు. అయినాసరే శనివారం ఎక్కడా జనం రద్దీ కానరాలేదు. దీంతో బాబు టూర్‌ షెడ్యూల్‌ ఎక్కడికక్కడ ఆలస్యం చేస్తూ పొలాల గట్ల వెంబడి నడిచి చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్లొచ్చారు. మొత్తం మీద ఈ ముప్పై ఏళ్లలో ఎప్పుడూ వెళ్లని, చూడని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం బాబు కాలు మోపించిన ఘటన వైఎస్సార్‌సీపీ సర్కారుకే దక్కిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

కొసమెరుపు..  
బాబు మాటలకు, చేతలకు ఎంత తేడా ఉంటుందో ఈ ఒక్క విషయం చాలు.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీల ఎన్నికలను  తాము పట్టించుకోలేదని, ‘‘చీ థూ.. అవి ఫలితాలా’’ అని బహిరంగంగా వ్యాఖ్యానించిన బాబు.. కుప్పం నియోజకవర్గంలో గెలిచిన ముగ్గురు ఎంపీటీసీలను మాత్రం ప్రత్యేకంగా అభినందించారు.  

ఈసారికి బస్సులో బస 
మూడు దశాబ్దాలకు పైగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సొంతిల్లు కానీ.. క్యాంపు కార్యాలయం కానీ లేని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లోనే బసచేస్తున్న విషయం తెలిసిందే. బాబు బసపై ‘సాక్షి’లో ఇటీవల గెస్ట్‌ హౌస్‌ బాబు పేరిట వచ్చిన కథనం చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన బస గెస్ట్‌హౌస్‌లో కాకుండా బస్సులో ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లలో బాబు తొలిసారి కుప్పంలో బస్సులో నిద్రపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.  

మరిన్ని వార్తలు