మాకు ప్రజలే బాస్‌లు

8 Nov, 2023 04:26 IST|Sakshi
మంగళవారం పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

మంథని, పెద్దపల్లి, మందమర్రి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌

మన పార్టీ హైకమాండ్‌ ఢిల్లీలో ఉండదు

ప్రతిపక్షాలకు అక్కడ స్విచ్‌ వేస్తేనే ఇక్కడ లైట్లు వెలుగుతాయి

గత పదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది

దేశంలో ఓ పొలికేక దళితబంధు పథకం

రైతుబంధు పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్న సీఎం 

అన్నీ ఆలోచించి, పార్టీని, అభ్యర్థిని చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకమాండ్‌ ఢిల్లీలో ఉండదని,  మన బాసులు తెలంగాణ ప్రజలేనని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టికెట్ల కోసం ఆఫీసులు తగులబెట్టుకునే పరిస్థితి మన దగ్గర లేదని చెప్పారు. మన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయని అన్నారు. ఇతర పార్టీలకు ఢిల్లీలో స్విచ్‌ వేస్తేనే ఇక్కడ లైట్లు వెలుగుతాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో డజను మంది సీఎం అభ్యర్థులున్నారని విమర్శించారు. అధికారంలోకొస్తే ఏడాదిలో ఎంతమంది మారతారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా మందమర్రిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. 

కాంగ్రెస్‌ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీ
‘కర్ణాటకలో ఏం జరుగుతోందో చూస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ ఒక నిశ్చితాభిప్రాయం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, రాష్ట్రానికో నీతి పెట్టింది. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ కదా..? తెలంగాణలో ప్రకటించిన స్కీమ్స్‌ ఛత్తీస్‌గఢ్‌లో పెట్టారా? రాజస్తాన్‌లో ఎందుకు అమలు చేయడం లేదు? ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఎన్నికలు అయిపోగానే బయటపడటం కాంగ్రెస్‌ నైజం. ఇతర పార్టీ నేతలను పశువులను కొన్నట్టు కొంటోంది.

నేను కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేసిన ఎన్నికల్లో చొప్పదండి నియోజకరవ్గంలో ఐదుగురు పార్టీ మండల అధ్యక్షులను కొనేశారు. అయితే ఆ ఊళ్లలో వారిని దంచింన్రు. అక్కడ ఆ పార్టీలకు ఐదు ఓట్లు కూడా రాలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కొంతమంది పిచ్చి నాయకులు గొర్రెల్లాగా పోవొచ్చు. నూరు కథల పడ్డా.. ప్రజల మనసులో గ్యారెంటీగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వస్తుందనే నమ్మకం ఉంది. అందులో అనుమాన పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్‌ ఉన్న ఎమ్మెల్యేనే రావాలి. వేరే ఆయన వస్తే లాభమైతదా.? ప్రజలు ఆలోచన చేయాలి..’ అని కేసీఆర్‌ కోరారు.

58 ఏళ్లు గోస పోసుకున్న కాంగ్రెస్‌
1956కు ముందు తెలంగాణ ఇండిపెండెంట్‌ స్టేట్‌గా ఉండేది. అయితే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తెలంగాణను ఆంధ్రాలో కలిపింది. సమైక్య రాష్ట్రంలో సాగు, తాగు నీళ్లు లేవు. కరెంట్‌ లేదు. ఉద్యమాలు, తుపాకీ మోతలు, ఎన్‌కౌంటర్లు, అమాయకులు చనిపోవడం, పోలీసులు చనిపోవడం.. రక్తపాతం.. దారుణమైన పరిస్థితి ఉండేది. ఆ దుస్థితి ఎవరి వల్ల వచ్చిందో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెసోళ్లు  తియ్యగా మాట్లాడితే సరిపోదు.

58 ఏండ్లు మా గోస పోసుకున్నది మీరు కాదా..? తెలంగాణ ఉద్యమ ఉప్పెనను చూసి తెలంగాణ ఇస్తామని 15 ఏళ్లు మోసం చేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. దేశంలోని 33 పార్టీల సపోర్టుతో తెలంగాణ వచ్చింది. గత పదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. అదే కాంగ్రెస్‌ ఉన్నప్పుడు తెల్లారితే మతకల్లోలాలు, కర్ఫ్యూలు.. ఆ పంచాయితీలన్నీ ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు

తెలంగాణ వచ్చాక సింగరేణి లాభాల వాటా పెంచాం
    ‘పార్లమెంట్‌ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడగొట్టింది కాంగ్రెస్‌ పార్టీనే. అమ్మా, బొమ్మా పేరు చెప్పి దళితులను మోసం చేసింది. కానీ దేశంలో పొలికేక ‘దళితబంధు’తో ఆ వర్గాలకు మేలు జరిగింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్‌ పథకమంటున్నారు. రైతుబంధు పదం పుట్టించిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఈ పథకం ఉండాలా? వద్దా? 24 గంటలు విద్యుత్‌ వద్దు.. 3గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఉండాలా? వద్దా? ‘ధరణి’ని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని కాంగ్రెస్‌ పార్టీయే ముంచింది.

తెలంగాణ వచ్చాక లాభాలు పెంచాం. తెలంగాణ రాక ముందు రూ.419 కోట్ల లాభాలు ఉంటే, ఇప్పుడు రూ.2,184 కోట్లకు చేరుకున్నాయి. కార్మికులకు దసరా, దీపావళికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నాం. సింగరేణి స్థలాల్లో పట్టాలు ఇచ్చాం. వారసత్వ ఉద్యోగాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పునరుద్ధరించింది. సింగరేణి కార్మికులకు గ్యాస్, నీరు, విద్యుత్‌ సౌకర్యాలపై వేసే పెర్క్‌ ట్యాక్స్‌ను కోల్‌ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా యాజమాన్యమే చెల్లించేలా చూస్తాం. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వినతి మేరకు కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ వర్తించేలా, మందమర్రి ఏజెన్సీలో ఎన్నికలు జరిగేలా చూస్తాం..’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

బీసీ చైతన్యం చూపెట్టాలి
‘బీసీ నాయకుడు బలంగా ఎదిగి పనిచేస్తుంటే అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలో ఆలోచించాలి. ఈసారి మంథని ఎన్నికల్లో బీసీ ఉద్యోగులు, విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు మీ బీసీల చైతన్యం చూపెట్టి పుట్ట మధును గెలిపించాలి. మధును భారీ మెజార్టీతో గెలిపిస్తే రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధులతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ముగ్గురు మోపయ్యారు. ఒకాయన పేకాట క్లబ్‌లతో డబ్బులు సంపాదించాడు. సీసాలు పంచుతున్నడు.

సూటుకేసులతో వచ్చే వారు కావాల్నా? బాల్క సుమన్‌ లాంటి వారు కావాల్నా? ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యంలో ఏకైక వజ్రాయుధం ఓటు. ఆషామాషీగా, డబ్బులకో.. ఎవరో చెప్పారనో వేయొద్దు. మీరు వేసే ఓటు మీ తలరాతను, ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. పార్టీ నడవడిక, సరళి, అభ్యర్థిని చూసి ఓటెయ్యాలి. ఏ ప్రభుత్వం మనకు పని చేస్తదో ఆలోచించి వేయాలి..’ అని సీఎం కోరారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, మధుసూదనచారి, ఎంపీ వెంకటేశ్‌ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్ధన్, రాజారమేష్, దుర్గం నగేష్, బీజేపీ నాయకుడు పత్తి శీను బీఆర్‌ఎస్‌లో చేరారు.

సీఎం హెలికాప్టర్‌ తనిఖీ
సాక్షి, పెద్దపల్లి: మంగళవారం పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో, కాన్వాయ్‌లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అనుసరించి ముఖ్యమంత్రి వారికి సహకరించారు.

మరిన్ని వార్తలు