తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీకి..ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయండి

8 Nov, 2023 04:21 IST|Sakshi

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి 

జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలి 

ఆ అవార్డు, అప్పటి ఒప్పందాల ఆధారంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి 

దిగువ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలను పరిరక్షించేలా నియమావళి రూపొందించాలి 

తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులను పునఃసమీక్షించాలి 

తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి 

కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి జలా­ల వాటాను తేల్చి, నీటిని పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై న్యాయసలహా, తెలంగాణ సర్కార్‌ అభిప్రాయం తీసుకుని కొత్త గోదావరి జ­ల వివాదాల ట్రిబ్యునల్‌పై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. 

కేంద్రానికి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. 
గోదావరి బేసిన్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. కానీ.. ప్రస్తు­­త జల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉత్పన్న­మైంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. 
అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు అంగీకరించారు.  
గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతను తేల్చాలి. 
ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాలి. దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆయకట్టు హక్కులను పరిరక్షించేలా ఎగువ ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని రూపొందించాలి. 
కాళేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టుల­కు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలి. 
అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణను ఆదేశిస్తూ.. దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. 
ఉమ్మడి రాష్ట్ర పరిధిలో జీడబ్ల్యూడీటీ (గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌) అవార్డు ప్రకారం గోదావరిలో నీటి లభ్యతను నిర్ధా­రించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాలు తేల్చడానికి ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ (అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు) చట్టం–1956 సెక్షన్‌–4(1) ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. 
జీడబ్ల్యూడీటీ అవార్డుతో పాటు విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్‌ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తుండటాన్ని అనేక సార్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. 
 ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మదింపు చేసి.. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించేవరకూ వాటిని నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశించినా తెలంగాణ సర్కార్‌ పట్టించుకోలేదు.  
తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది.  
 రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైన నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం.. 2020, అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన మేరకు ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్‌–3 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గోదావరి జలాలను పంపిణీ చేయాలి.  
 జీడబ్ల్యూటీడీ అవార్డు ద్వారాగానీ విభజన చట్టం ద్వారాగానీ రెండు రాష్ట్రాలకు ఇప్పటిదాకా గోదావరి జలాలను ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. కానీ.. తెలంగాణ సర్కార్‌ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా అక్రమంగా కాళేశ్వరం(450 టీఎంసీలు), దేవాదుల మూడో దశ (22 టీఎంసీలు), తుపాకులగూడెం బ్యారేజ్‌ (100 టీఎంసీలు), సీతారామ ఎత్తిపోతల (100 టీఎంసీలు), వాటర్‌ గ్రిడ్‌ (32.58 టీఎంసీలు), లోయర్‌ పెన్‌గంగపై బ్యారేజ్‌లు (6.55 టీఎంసీలు), రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌కు తరలింపు (3 టీఎంసీలు) ప్రాజెక్టులను చేపట్టింది.

 నికర జలాల్లో మిగులు లేకుండానే.. 
జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో గోదావరిలో 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో పాటు 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్‌ తేల్చింది.  
 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టులకు 659.691 టీఎంసీల కేటాయింపు ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116.20 టీఎంసీలు అవసరం. అంటే ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ 775.891 టీఎంసీలు. బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే వరద 
జలాలపై పూర్తి హక్కు ఉంటుంది. 
తెలంగాణలో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 471.686 టీఎంసీలను వినియోగించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు అవసరం. అంటే.. తెలంగాణ డిమాండ్‌ 649.802 టీఎంసీలు. గోదావరిలో 1,430 టీఎంసీల నికర జలాలు ఉంటాయని వ్యాప్కోస్‌ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. 1425.693 టీఎంసీలు అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదు. 
గోదావరి నికర జలాల్లో మిగులు లేకున్నా సరే.. 714.13 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్‌ ఏకపక్షంగా అక్రమంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ హక్కులకు విఘాతం కలుగుతుంది. 
♦ గోదావరి జలాల వినియోగం, పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోయినా తెలంగాణ సర్కార్‌ కాళేశ్వరం ప్రాజెక్టును 2015లో చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని అనేకసార్లు కోరినా పెడచెవిన పెట్టి.. 2018, జూన్‌ 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. 
అంతర్రాష్ట్ర జల వివాదం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్టు అథారిటీ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతి చెల్లదు.

మరిన్ని వార్తలు