శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదు: సీఎం రేవంత్‌

20 Dec, 2023 17:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదన్నారు. ఇది ఎవరినీ నిందించే ప్రయత్నం కాదని క్లారిటీ ఇచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ప్రభుత్వం ఆశించడం లేదని రేవంత్‌ స్పష్టం చేశారు. 

కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘పదేళ్లు రాష్ట్రం కోసం పనిచేసిన అధికారులను అవమానించేలా హరీష్‌రావు మాట్లాడారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే నిధులు ఖర్చు చేసిందా? లేదా అనేది కాగ్‌ చెబుతుంది. ఈ శ్వేతపత్రం మేం ఇచ్చిన వాగ్దానాలను ఎగవేసేందుకు కాదు. 2014-15లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్బీఐ వద్ద 303 రోజులు మిగులు నిధులు ఉండేవి. పదేళ్లలో అది 30 రోజులకు తగ్గింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లోన్లు పుట్టని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్బీఐ సమాచారం ఇస్తుంది. 

ఏ నిర్ణయమైనా సభలోనే..
ఇవి వాస్తవాలు.. వీటిని కప్పిపుచ్చి గొప్పలకు పోతే నష్టపోతాం. గత ప్రభుత్వ సమయంలో పనిచేసిన అధికారులే ఈ లెక్కలు ఇచ్చారు. ప్రతిపక్షంలోకి వెళ్లినందుకు వాళ్ల​కు దు:ఖం ఉండవచ్చు. అర్హులైన వారికి అవకాశాలను ఇస్తుందని చెప్పేందుకే మా ప్రయత్నం. తెలంగాణ అభివృద్ధి కోసం సిద్ధాంత విబేధాలున్నప్పటికీ ప్రధానిని కలిసేందుకు కిషన్‌రెడ్డిని నేనే అడిగాను. మేం ఏం చేయాలనుకున్నా సభ ముందు పెడతాం. తెలంగాణ ప్రపంచంతో పోటీపడేలా చేయాలన్నదే మా లక్ష్యం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం. 

త్వరలో అఖిలపక్ష భేటీ..

త్వరలోనే అఖిలపక్షం సమావేశం పెడతాం. గ్రేటర్ సిటీతో పాటు పలు అంశాలపై చర్చలు జరుపుతాం. సభలో ఉన్న వాళ్ళే కాదు.. లేని సీపీఎం పార్టీ వంటి నేతలను సైతం పిలుస్తాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్న డాక్యుమెంట్ రూపంలో సభలో పెడతాం. ఇంట్లో కూర్చుని నిర్ణయాలు తీసుకొము. అందరితో చర్చలు జరిపే నిర్ణయాలు ఉంటాయి’ అని స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు