‘వాళ్లు హద్దులు దాటారు’.. ఉపరాష్ట్రపతికి సంఘీభావంగా గంటపాటు నిల్చున్న ఎన్డీయే ఎంపీలు

20 Dec, 2023 13:43 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ ఒకరు చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్‌ ధన్‌కడ్‌ ఈ చర్యను ఖండించగా.. ప్రధాని మోదీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు కూడా. ఈ క్రమంలో.. బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్‌కడ్‌కు సంఘీభావం ప్రకటించారు.

‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు.  అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్‌ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభలో తెలిపారు. 

వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారాయన.

ఏం జరిగిందంటే.. 
ఎంపీల సస్పెన్షన్‌ పరిణామం అనంతరం.. పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌ను ఉద్దేశించేలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు. ఆయన గొంతును అనుకరిస్తూ.. విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. రాహుల్‌ గాంధీ ఆ దృశ్యాలను  తన ఫోన్‌లో చిత్రీకరించారు. దీనిపై ధన్‌కడ్‌ మండిపడుతూ.. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. 

మరోవైపు రాజకీయంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. అధికార-విపక్ష ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమం‍త్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. రాహుల్‌ జీ(రాహుల్‌ గాంధీ) వీడియో తీసి ఉండకపోతే.. ఈ వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరిగి ఉండి కాదేమో అనేలా ఆమె ప్రకటన ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ధన్‌కడ్‌కు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. జాట్‌ కమ్యూనిటీ సైతం ఈ డిమాండ్‌తో నిరసనలకు దిగింది.

>
మరిన్ని వార్తలు