దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

21 Dec, 2023 05:14 IST|Sakshi

అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి 

2014–15లో రాష్ట్ర ఖజానాలో 303 రోజులు నిధులు ఉండేవి 

అది 2022–23 నాటికి 33 రోజులకు తగ్గిపోయింది 

మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో వ్యాపారం చేస్తామని అప్పులు చేశారు 

ఎవరినీ కించపర్చే ఉద్దేశం తమకు లేదని వ్యాఖ్య 

మాజీ మంత్రి హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉందనేది ప్రజల ముందు పెట్టేందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేవని పేర్కొన్నారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక స్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వెల్లడించిన గణాంకాలనే శ్వేతపత్రంలో వివరించామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఖజానాలో నిధులు 303 రోజులు ఉండేవని, 2022–23 ఆర్థిక సంత్సరానికి వచ్చేసరికి కేవలం 38 రోజులే నిధులు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రతిరోజు అడుక్కునే స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రంపై విపక్షాల అభ్యంతరాలను రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మా ప్రభుత్వం తొలిరోజు నుంచే ప్రజాపాలన సాగించేలా చర్యలు చేపట్టింది. తెలంగాణను బలమైన రాష్ట్రంగా ప్రపంచ చరిత్రలో నిలుపుతాం. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలను అందిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలవడం కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నేను స్వయంగా ఫోన్‌ చేశా. రాష్ట్ర సంక్షేమం కోసం ఎలాంటి ప్రయత్నాన్ని వృథా కానివ్వం. 

ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చారు 
తెలంగాణ రావడానికి పూర్వం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కష్టపడి సంపాదించి పెట్టిన ఆస్తులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనఖాపెట్టి అప్పులు తెచ్చింది. ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన జూబ్లీ బస్టాండ్, పలు ఇతర బస్టాండ్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనఖాపెట్టి రూ.2,886 కోట్లు అప్పు తెచ్చింది. టీఎస్‌ జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌ సహా ఇతర కరెంటు సంస్థల ఆస్తులపై రూ.4,972 కోట్లు అప్పు తెచ్చారు.

మేం కష్టపడి ఔటర్‌ రింగురోడ్డును నిర్మిస్తే రూ.7,300 కోట్లకు తెగనమ్ముకుని బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకేసారి కోసుకుతిన్నారు. గత పదేళ్లలో రూ.13.72 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇంతా చేసీ సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. పేద కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా ఉంటానన్న కేసీఆర్‌ ఆసరా పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. పైగా మాజీ మంత్రి హరీశ్‌రావు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారు. 

వ్యాపారం చేస్తామని అప్పులు చేశారు 
నీటిపారుదల శాఖ మంత్రులుగా కేసీఆర్, హరీశ్‌రావు ఇద్దరే తొమ్మిదిన్నరేళ్లు చూసుకున్నారు. కాళేశ్వరాన్ని రూ.80 వేల కోట్లతో కట్టామనడం అబద్ధం. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు రూ.97,449 కోట్లు మంజూరైతే.. విడుదలైంది రూ.79,287 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి ఖర్చు చేసింది. దీనిపై సమగ్ర వివరాలను ఇస్తాం. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణా లు కలిపితే అసలు లెక్క తేలుతుంది. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని.. ఏటా రూ. 5,199 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి అప్పులు తెచ్చారు.

మిషన్‌ భగీరథతోనూ ఏటా రూ.5,706 కోట్లు ఆదాయం వస్తుందని.. ఇలా నీటి ద్వారా రూ.10,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని బ్యాంకులను తప్పుదోవ పట్టించి రుణాలు తీసుకొచ్చారు. వాటిపై మాజీ ఆర్థికమంత్రి హరీశ్‌రావు సంతకాలు చేశారు. అత్యధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన విషయాన్ని కాగ్‌ తన నివేదికలో స్పష్టంగా తేల్చింది. ఇంతా చేసి ఇంకా హరీశ్‌రావు మంత్రి అన్నట్టుగానే భ్రమల్లో ఉండి అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తున్నారు.

తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పాల్సింది పోయి దబాయిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? గ్రామాల్లో నల్లాలు లేవా? నీళ్ల ట్యాంకులు లేవా? బీఆర్‌ఎస్‌ వచ్చాకే మంచినీళ్లు తాగినట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తండ్రిని కూలదోసి రాజ్యాన్ని లాక్కునే ప్రయత్నాలను చరిత్రలో చాలా చూశాం. 

‘హైదరాబాద్‌’పై అఖిలపక్షం 
హైదరాబాద్‌ ప్రపంచ ఖ్యాతి గాంచింది. ఈ మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తాం. 119 మంది ఎమ్మెల్యే లు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు అసెంబ్లీలో అడుగుపెట్టని సీపీఎం, ఇతర పారీ్టలను అఖిలపక్ష సమావేశాలకు పిలుస్తాం.’’అని రేవంత్‌ పేర్కొన్నారు. 

­అప్పులెందుకు చేశారు.. దేనికి ఖర్చు పెట్టారు?: కూనంనేని 
కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో సాగిన పాలన ఇప్పుడు రూ.6.7లక్షల కోట్ల అప్పులకు చేరడం ఆలోచించాల్సిన విషయమని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు అవసరాలకు అప్పులు తీసుకున్నా.. ఆ నిధులు దేనికి ఖర్చు చేశారనే లెక్కలు ప్రజలకు చెప్పాలని, జవాబుదారీగా పాలన సాగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు. 

సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు! 
మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని రేవంత్‌ పేర్కొన్నారు. ‘‘శాసనసభను తప్పుదోవ పట్టించేలా సభ్యులెవరైనా మాట్లాడితే, ఆధారాలు లేకుండా ఉన్నట్టు చిత్రీకరిస్తే.. సభలో తప్పుడు సమాచారాన్ని ఇస్తే కఠిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో శాసనసభ వ్యవహారాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని ఒకసారి పరిశీలించాలి’’అని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. తన ప్రసంగం సందర్భంగా రేవంత్‌ రెండు సార్లు హరీశ్‌రావును ఆర్థికమంత్రి అని ప్రస్తావించారు. తర్వాత మాజీ ఆర్థిక మంత్రి అని సరిదిద్దుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని హరీశ్‌రావు దొంగలెక్కలు ఏవో చెప్పుకుంటారని, ఆయన గెలిచింది ఐదుసార్లేనని విమర్శించారు.  

>
మరిన్ని వార్తలు