ఆరని అసంతృప్తి జ్వాలలు 

17 Oct, 2023 00:31 IST|Sakshi
గాంధీభవన్‌ వద్ద నిరసన తెలుపుతున్న అసంతృప్త నేతలు

ధర్నాలు.. దిష్టిబోమ్మల దహనాలు 

కాంగ్రెస్‌ తొలి జాబితాలో టికెట్లు రాని వారి ఆక్రోశం 

గన్‌పార్క్‌ వద్ద నిరసన చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌ పుర టికెట్ల కోసం ముస్లిం నేతల పట్టు 

యాష్కీ నివాసంలో భేటీ అయిన షెట్కార్, రాజయ్య, బలరాం నాయక్‌  

అసంతృప్తులను బుజ్జగిస్తున్న ఠాక్రే 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ లో టికెట్లు రాని అసంతృప్తుల ఆందోళనలు ఆగలేదు. తొలిజాబితా ప్రకంపనలు సోమవారం కూడా కొనసాగాయి. టికెట్లు ప్రకటించిన రోజున ఆదివారం హైదరాబాద్‌ వేదికగా గాందీభవన్‌కు పరిమితమైన ఆందోళనలు రెండోరోజు గన్‌పార్కు వరకు పాకా యి. గద్వాల టికెట్‌ ఆశించిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు కురువ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో గన్‌పార్కు వద్ద నిరసన తెలిపారు.

పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇక, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, చార్మినార్‌ స్థానాలను ముస్లిం నాయకులను కేటాయించాలని కోరుతూ వరుసగా రెండోరోజు స్థానిక నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌ మెట్లపై ధర్నా చేశారు. కాగా, పార్టీ నేతలపై ఆర్థిక ఆరోపణలు చేసిన కురవ విజయ్‌కుమార్, గాం«దీభవన్‌ మెట్లపై ధర్నా చేసిన పాతబస్తీ నేత కలీమ్‌లను సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

నాగం వాట్‌ నెక్స్ట్‌ 
ఇక, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్థానిక కేడర్‌తో సమావేశమయ్యారు. మరోవైపు మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, బలరాం నాయక్, సురేశ్‌షెట్కార్, సిరిసిల్ల రాజయ్యలు మధుయాష్కీ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాతో పాటు ఇంకా ఖరారు కాని టికెట్ల వ్యవహారంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే బుజ్జగింపుల కోసం రంగంలోకి దిగారు. సోమవారం గాం«దీభవన్‌లోని వార్‌రూంలో ఆయన చాలా సేపు అసంతృప్తులతో మంతనాలు జరిపారు. ఉప్పల్‌తో పాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. టికెట్‌ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించిన ఠాక్రే ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

ఆ ఇద్దరు నేతల సస్పెన్షన్‌... 
ఇక, కురువ విజయ్‌కుమార్, కలీమ్‌లను సస్పెండ్‌ చేయా లని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. సోమవారం గాం«దీభవన్‌లో సమావేశమైన కమిటీ టికెట్‌ రాలేదన్న ఆక్రోశంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గాందీభవన్‌ లో పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ఫ్లెక్సీలను చించి వేయడం, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలను సీరియస్‌గా పరిగణించింది. టికెట్ల విషయంలో పీసీసీ అధ్యక్షుడిని మాత్రమే బాధ్యుడిని చేయడం కక్షపూరిత చర్యగా భావించిన కమిటీ కురువ విజయ్‌ కుమార్‌ (గద్వాల), కలీమ్‌బాబా (బహదూర్‌పుర)లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

రేవంత్‌ టార్గెట్‌గా ఆందోళనలు..
కాగా, అటు గాందీభవన్‌లో, ఇటు గన్‌పార్క్‌ వద్ద సోమవారం జరిగిన ఆందోళనల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేంద్రబిందువు అయ్యారు. ఉస్మానియా విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు కేటాయించాల్సిన గద్వాల టికెట్‌ను రూ.10 కోట్ల నగదు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇప్పటివరకు పార్టీ లో 65 టికెట్లను రూ.600 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. దీంతో పాటు గాం«దీభవన్‌లో పాతబస్తీ నేతల ఆందోళనలోనూ రేవంత్‌ను విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

90 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉండే స్థానాలను హిందువులకు కేటాయించడమేంటని, పాతబస్తీలో ఎంఐఎంపై గట్టిగా పోటీ చేయాలన్న ఆసక్తి రేవంత్‌కు లేదంటూ çప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమయింది. ఇక, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ లోకి వస్తున్నారన్న వార్తల పట్ల స్థానిక డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీ లో చేరుతున్నారన్న వార్తలు కూడా స్థానిక నాయకత్వంలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లున్న తొలి జాబితా విడుదల తర్వాతే ఇంతటి అసంతృప్తి వ్యక్తమయితే ఇక రెండో జాబితా విడుదలయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని వార్తలు