Congress Candidates List: 16 మందితో కాంగ్రెస్‌ మూడో జాబితా 

7 Nov, 2023 03:03 IST|Sakshi

కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి, చెన్నూరు నుంచి వివేక్‌

షబ్బీర్‌ అలీ, సురేష్‌ షెట్కార్, ఏనుగు రవీందర్‌రెడ్డి, నీలం మధుకూ చాన్స్‌

రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన అధిష్టానం

వనపర్తిలో చిన్నారెడ్డి ఔట్‌.. మేఘారెడ్డి ఇన్‌

బోథ్‌ నుంచి అశోక్‌ స్థానంలో ఆదె గజేందర్‌

సీపీఐకి కొత్తగూడెం..పెండింగ్‌లో 4 స్థానాలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితా విడుద లైంది. 16 స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థు లను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ, ఐదు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కొడంగల్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కామారెడ్డి నుంచీ సీఎం కేసీఆర్‌పై బరిలో దింపారు.

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన జి.వివేకానందకు చెన్నూ రు టికెట్‌ ఇచ్చారు. ఏనుగు రవీందర్‌ రెడ్డి బాన్సు వాడ నుంచి, షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ నారాయణ్‌ఖేడ్‌ నుంచి, నీలం మధు ముదిరాజ్‌ పటాన్‌చెరు నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితాలో 14 స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించగా, మరో రెండు స్థానాలకు గతంలో ప్రకటించిన అభ్యర్థులను మార్చారు.

గతంలో బోథ్‌ నియోజకవర్గానికి వన్నెల అశోక్‌ పేరును ప్రకటించగా, తాజాగా ఆ యన స్థానంలో ఆదె గజేందర్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే వనపర్తికి గతంలో జిల్లెల చిన్నారెడ్డి పేరు ను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. అనేక కసరత్తుల తర్వాత ఆయన స్థానంలో తుడి మేఘారెడ్డిని బరిలోకి దింపుతోంది.

ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి మొత్తం 114 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐకి కొత్తగూడెం కేటాయించగా.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్‌ సీట్లను పెండింగ్‌లో ఉంచింది. ఒకవేళ సీపీఎంతో చర్చలు సఫలం అయితే వారికి మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు