TS Elections 2023: నాన్న గెలుపు కోసం ఇంతైనా చేయకుంటే ఎలా..!?

13 Nov, 2023 13:31 IST|Sakshi

సాక్షి,తెలంగాణ:  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. తమ కుటుంబం నుంచి చట్టసభకు ఎన్నికవుతున్నారంటే ఎవరికి సంతోషంగా ఉండదు? తండ్రి కోసం కొడుకు, కూతుర్లు ప్రచారం చేయడం మామూలే..అలాగే భర్త కోసం భార్య..భార్య బరిలో ఉంటే భర్త ప్రచారం చేస్తారు. అన్న కోసం తమ్ముడు..తమ్ముడు కోసం అన్న...ఇలా కుటుంబ సభ్యలంతా శ్రమిస్తారు. ఇప్పుడొక జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నలుగురు సీనియర్ నేతల కోసం వారి కుమార్తెలు ప్రచారం చేస్తున్నారు. తమ ఇంటి పెద్ద గెలుపు కోసం  తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? ఆ నలుగురు ఎవరో చూద్దాం.
 

తం‍డ్రులకు సాయంగా కుమార్తెలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ..గజ్వేల్ నుండి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, జహీరాబాద్ నుండి మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు, ఆందోల్ నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బరిలో నిలిచారు. ఈ నలుగురు సీనియర్ నేతల గెలుపు కోసం వారి నలుగురు కుమార్తెలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.

సావధానంగా ప్రచారం..
జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్ర శేఖర్ రోజువారీ ప్రచారంలో భాగంగా.. వస్తున్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో గత వారం రోజులుగా అయన కుమార్తె  బిందుప్రియ ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ వార్డుల్లోని ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా వింటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలో రోజుకు 3వార్డుల చొప్పున 21 వార్డులలో ప్రచారాన్ని పూర్తి చేసారు. మహిళా సాధకారత కొసం తమ తండ్రి చాలా కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలలో కూడా మహిళలకే పెద్ద పీట వేశారని చంద్రశేఖర్ కుమార్తె బిందు ప్రియ ఓటర్లుకు వివరిస్తున్నారు.
 

గెలవాలనే పట్టుదలతో ప్రచారం..
ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆందోల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజకీయం ముఖచిత్రం మారిపోయింది. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ గులాబీ జెండానే ఎగిరింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవి నిర్వహించిన దామోదర రాజనర్సింహ రెండు వరుస ఓటములతో మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఈ సారి గెలవకపోతే భవిషత్తు రాజకీయాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న దామోదర రాజనర్సింహ తన కూతురు త్రిషను ప్రచార రంగంలోకి దించారు. తండ్రి దామోదర రాజనర్సింహ గెలుపు బాధ్యతల్ని తన భుజాలకు ఎత్తుకున్న త్రిష నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు.
 
రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కూతురు.. 
ఒకే రోజు వేరు వేరు మండలాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఆహ్వానం అందింది అంటే అన్ని శుభ కార్యక్రమాలకు హాజరవుతున్న త్రిష..తన తండ్రి హయాంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాల్లో పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఒక పక్క దామోదర రాజనర్సింహ.. మరో ఒక్క కూతురు త్రిష నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇంత కాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్.. త్రిష రాకతో కొత్త ఉత్సహంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారంలో దూసుకుపోతున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువతను పార్టీలోకి తీసుకొని యాక్టివ్ చేసే పనిని ఆమె భుజానవేసుకొని సాగుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌లో జోష్ పెరగడంతో ఈ సారి ఆందోల్ లో దామోదర్ గెలుపుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో MBA పూర్తి చేసిన త్రిష తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

తండ్రి చేసిన సేవలను వివరిస్తూ..
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాక గజ్వేల్‌లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన తూముకుంట నర్సారెడ్డి విజయం కోసం తూముకుంట ఆంక్షరెడ్డి ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో  మమేకమవుతూ..కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఓటర్లకు వివరిస్తున్నారు. తన తండ్రి నర్సారెడ్డిని  గెలిపించాలని కోరుతున్నారు. లండన్ లో ఉన్నత విద్య అభ్యసించిన ఆంక్ష రెడ్డి..రాజకీయాల మీద ఆసక్తితో తండ్రి బాటలో నడుస్తున్నారు. గత అయిదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆంక్ష రెడ్డి ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ యువజన అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. 
 

తండ్రిని గెలిపించిన కూతురు..
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లోనే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి తండ్రి ప్రచారంలో కీ రోల్ పోషించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్ట్ అయితే ఆయన కూతురు జయారెడ్డి చిన్న వయస్సులోనే తండ్రిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నియోజకవర్గం అంతా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను ఆకట్టుకొని తండ్రి జగ్గారెడ్డి గెలిపించుకున్నారు. తాజా ఎన్నికల్లో కూడా మరోసారి తండ్రి విజయం కోసం శ్రమిస్తున్నారు జయా రెడ్డి. స్టేట్ యూత్  కాంగ్రెస్  జనరల్ సెక్రెటరీగా జయారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

గత ఎన్నికల్లో తండ్రిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన జయారెడ్డి బాటలోనే మిగిలిన ముగ్గురు యువతులు ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ ముగ్గురు కూడా తమ తండ్రులను విజయతీరాలకు చేరుస్తారా?

మరిన్ని వార్తలు