ధర్మవరం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్‌

10 Mar, 2024 14:32 IST|Sakshi

సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్‌ మొదలైంది. ఇద్దరిలో ఒకరు గత ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రస్‌ లేకుండా పోయాడు. తర్వాత బీజేపీలో చేరాడు. ఇప్పుడు పార్టీ ఏదైనా మళ్ళీ అక్కడే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంకోనేత మాజీ మంత్రి కుమారుడు. ఇప్పుడు ఇద్దరూ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. తమ రాజకీయ ఉనికి కోసం శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు కూడా వెనకాడటంలేదు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? 

పరిటాల శ్రీరాం, గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలియాస్ వరదాపురం సూరీ... ఈ ఇద్దరూ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎవరి మార్గంలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వరదాపురం సూరి 2014లో ధర్మవరం నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల భయంతో టీడీపీ జెండా పీకేసీ..కమలం గూటికి చేరాడు. దీంతో ధర్మవరం ఇన్‌చార్జ్‌ బాధ్యతలను పరిటాల కుటుంబ వారసుడు శ్రీరాంకు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్ళుగా ధర్మవరంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిటాల శ్రీరాం వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ వస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ధర్మవరంపై కన్నేశారు వరదాపురం సూరీ. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన అవసరం అయితే మళ్ళీ టీడీపీలో చేరి పోటీ చేస్తానని చెబుతున్నారు. ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీకి వంద కోట్లు ఫండ్ ఇచ్చేందుకైనా సిద్ధమంటూ వరదాపురం సూరీ కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మవరం టిక్కెట్ వరదాపురం సూరీకి ఖరారు అయిందని ఆయన వర్గీయులు  కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సూరీ వర్గీయుల వైఖరిపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పారిపోయిన వరదాపురం సూరీ మళ్లీ టిక్కెట్ కోరటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అంటున్నారు. 

టీడీపీ టిక్కెట్ వందకోట్లకు కొంటానంటూ సూరీ, ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారాన్ని పరిటాల శ్రీరాం ఖండిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెనుకొండ వద్ద జరిగిన చంద్రబాబునాయుడు రా. కదలిరా సభకు జనాన్ని సమీకరించడానికి పరిటాల శ్రీరాం- వరదాపురం సూరీ పోటీపడ్డారు. పైగా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. వరదాపురం సూరీ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై పరిటాల వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వరదాపురం సూరీ వర్గీయులు కూడా ప్రతిదాడులు చేశారు. దీంతో దాదాపు పది వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య దాదులు ప్రతిదాడులతో బత్తలపల్లి ప్రాంతం రణరంగమైంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వరదాపురం సూరి, పరిటాల శ్రీరాం వర్గాల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని సాధారణ ప్రజలు భయపడే పరిస్థితి కొనసాగుతోంది. టీడీపీ నేతల తీరుపై సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పరిటాల శ్రీరాం- వరదాపురం సూరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers