మాజీ సీఎంపై సంజయ్‌దత్‌ పోటీ.. నిజమేనా? | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంపై సంజయ్‌దత్‌ పోటీ.. నిజమేనా?

Published Mon, Apr 8 2024 3:40 PM

Sanjay Dutt Not Joining Any Party, Contesting Polls - Sakshi

ముంబై : బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారా? లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సీఎం ప్రత్యర్ధిగా బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్‌ మీడియాలో వార్తలు. అందుకు సంజయ్‌ దత్‌ ఏమన్నారు. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సంజయ్‌దత్‌ ఓ రాజకీయ పార్టీలో చేరబోతున్నారని, ఆ పార్టీ తరుపున ఎన్నికల్లో చేయబోతున్నారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ తరుణంలో  తనపై వస్తున్న రూమర్స్‌కు సంజయ్‌దత్‌ చెక్‌ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. ఒకవేళ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుంటే, నేనే స్వయంగా ప్రకటిస్తానని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

నేను ఏ పార్టీ చేరడం లేదు
‘నేను రాజకీయాల్లోకి వస్తున్నానే పుకార్లకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీలో చేరడం లేదు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు. దయచేసి నా గురించి వస్తున్న ప్రచారాల్ని మీరు నమ్మకండి అని పోస్ట్‌ చేశారు.   

ఖట్టర్‌కు పోటీగా సంజయ్‌ దత్‌ అంటూ 
అంతకుముందు సంజయ్‌దత్‌ హర్యానాలోని కర్నాల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ బలమైన నేత, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు పోటీగా సంజయ్‌ దత్‌ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది.

హర్యానాతో ఉన్న అనుబంధంతో 
అందుకు హర్యానాతో సంజయ్‌ దత్‌కు ఉన్న అనుబంధమేనని తెలుస్తోంది. సంజయ్‌దత్‌ పూర్వీకుల గ్రామం యమునానగర్ జిల్లాలో ఉంది. గతంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా కోసం ఎన్నికల ప్రచారం చేసేందుకు హర్యానాకు వచ్చారు. దీంతో పాటు సంజయ్ దత్ తండ్రి, నటుడు, దివంగత సునీల్ దత్ పలు మార్లు  కాంగ్రెస్ ఎంపీగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరి ప్రియా దత్ కూడా కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. 

ప్రచారానికి పులిస్టాప్‌
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ సంజయ్‌దత్‌ను ఎన్నికల బరిలోకి దించుతుందనే ప్రచారానికి బలం చేకూరినట్లైంది. ఇక సంజయ్‌దత్‌ ట్వీట్‌తో ప్రచారానికి పులిస్టాప్‌ పడింది. కాగా, 2014, 2019 ఎన్నికల్లో హర్యానా కర్నాల్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. అంతకు ముందు రెండు పర్యాయాలు ఈ సీటు కాంగ్రెస్‌కు దక్కింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement