Chandra Babu Naidu బాబోయ్‌.. మీకో దండం!

26 Sep, 2021 05:14 IST|Sakshi

టీడీపీలో ఇమడలేకపోతున్న సీనియర్‌ నేతలు

చంద్రబాబు తీరుతో విసిగిపోయి దూరమవుతున్న నేతలు 

మొన్న బుచ్చయ్య చౌదరి.. నిన్న కేశినేని నాని

ఇప్పటికే పార్టీకి దూరంగా గంటా, నారాయణ, మురళీమోహన్‌ తదితరులు

మీడియాలో షో చేసేవారికే టీడీపీలో పెద్దపీట వేయడంపై అసంతృప్తి

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్‌ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్‌ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు.

చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్‌ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

చురుగ్గా లేని సీనియర్‌ నేతలు
గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్‌ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు.

టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు.

మరిన్ని వార్తలు