తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?

Published Fri, Nov 24 2023 5:04 PM

TS Assembly Elections 2023: Senior Most Leaders Profiles  - Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్‌ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే..  


1. వనమా(బీఆర్‌ఎస్‌.. కొత్తగూడెం)


వ‌నమా వెంకటేశ్వరరావు..(78) కొత్త‌గూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్య‌ర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొద‌టిసారిగా  కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు.

మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప‌దేళ్ల త‌రువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంత‌రం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి జ‌ల‌గం వెంక‌ట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు.

2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. 

2. మర్రి శశిధర్‌ రెడ్డి (బీజేపీ.. సనత్‌నగర్‌)


సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి(74)..  తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్‌ కూడా. ప్రస్తుతం సనత్‌నగర్‌ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్‌ గా నిలిచిన శశిధర్‌.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్‌ నగర్‌ నుంచే బరిలో నిలిచారాయన. 

3. పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి (కాంగ్రెస్‌.. బోధన్‌)


మరో సీనియర్‌ నేత సుదర్శన్‌ రెడ్డి(74).. 2023లో బోధన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన  పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్‌లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్‌ నుంచి పోటీలో నిలిచారాయన. 

4. టీ.జీవన్‌ రెడ్డి (కాంగ్రెస్‌, జగిత్యాల)


సీనియర్‌ నేత తాటిపర్తి జీవన్‌ రెడ్డి (72). కాంగ్రెస్‌ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార‍్లు నెగ్గి జీవన్‌ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.  ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్‌ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 

5. నడిపెల్లి దివాకర్‌ రావు (బీఆర్‌ఎస్‌.. మంచిర్యాల)


కాంగ్రెస్‌ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్‌ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ని వీడి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు.

6. తుమ‍్మల నాగేశ్వర్‌రావు (కాంగ్రెస్‌.. ఖమ్మం)


తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు.  తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్‌ఎస్‌కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ చేరి ఖమ్మం బరిలో నిలిచారు.

7. బాబూ మోహన్‌ (బీజేపీ.. ఆందోల్‌)


సినీ నటుడైన బాబూ మోహన్‌..(71) సీనియర్‌ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్‌ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు.

8. రేవూరి ప్రకాష్‌ రెడ్డి (కాంగ్రెస్‌.. పరకాల)

సీనియర్‌ నేత రేవూరి ప్రకాష్‌ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్‌ ప్రకాష్‌ రెడ్డిని వరంగల్‌ రూరల్‌ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది.  

9. రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి (కాంగ్రెస్‌.. సూర్యాపేట)

సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎ‍మ్మెల్యేగా నెగ్గిన ట్రాక్‌ ఈయనది.  కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్‌ ఎమ్మె‍ల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు.

10. ముఠా గోపాల్‌ (బీఆర్‌ఎస్‌.. ముషీరాబాద్‌)


ముఠా గోపాల్‌..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

11. మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌.. ఇబ్రహీంపట్నం)


మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన.

Advertisement
Advertisement