నాడు లోకేష్‌ను దొంగ అన్న పవన్‌ ఇప్పుడెందుకు మాట మార్చారు: పేర్ని నాని

22 Dec, 2023 16:37 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్‌ది అట్టర్‌ ప్లాప్‌ యాత్ర అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్‌ యాత్ర చేశారు. యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు. 

కాగా, పేర్ని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘నారా లోకేష్‌ అట్టర్‌ ప్లాప్‌ సినిమా. అది పాదయాత్ర కాదు.. జంపింగ్‌ జపాంగ్‌ యాత్ర. లోకేష్‌ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు. కానీ, చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు. యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బూతులు తిట్టారు. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్‌ బయటకు వస్తారు. 

పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు?
తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. 650 హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు, మోసాలైనా చేస్తారు. ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు?. పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు బేరాలు చేసుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండాలన్నదే పవన్‌ ఆరాటం. ఒకప్పుడు లోకేష్‌ను దొంగ అన్న పవన్‌ ఇప్పుడు ఎందుకు ఓటేయమని చెబుతున్నాడు.  

ఎవరు పాలేరు పవన్‌..
సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించారు. అలా విమర్శించిన వారే ఇప్పుడు మూడురెట్లు ఎక్కువ సంక్షేమం అందిస్తామంటున్నారు. అధికారం కోసం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మమల్ని పాలేరులు అని తిట్టిన పవన్‌ ఇప్పుడు ఎవరికి పాలేరుగా పనిచేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ప్రయత్నిస్తున్నారు. 2019లో పంచసూత్రాలన్నాడు. 2024లో ఆరు సూత్రాలంటున్నాడు. తప్పుడు పనులు చేయాలి.. అధికారం కొట్టేయాలి .. దోచుకుతినాలనేదే బాబు ఆలోచన. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మూడు గ్యాస్ బండలు ఎందుకివ్వలేదు. 2014 నుంచి 2019 వరకూ మహిళలకు ఫ్రీ బస్సు ఎందుకివ్వలేదు?. ప్రశ్నిస్తా ఓటేయండని చెప్తూ పవన్ భజన చేస్తున్నాడు. 2014లో ఇచ్చింది ఉమ్మడి మేనిఫెస్టోనే కదా. 

లోకేష్‌ నిన్ను క్షమాపణ కోరాడా?
నా తల్లిని దూషించారు .. ఖబర్ధార్ లోకేష్ అన్నావ్ కదా పవన్. మరి లోకేష్ నీ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాడా?. లోకేష్‌ను దొంగ అని తిట్టి.. ఇప్పుడెందుకు వాళ్లకు ఓటేయమంటున్నావ్. ఎంత తీసుకున్నావ్.. ఎంతకు అమ్ముడుపోయావ్?. జనసేనకు 25 సీట్లే ఇస్తున్నామని టీడీపీ చెబుతోంది. కండువాల్లో తేడా తప్ప  పవన్‌తో సహా అక్కడున్న అందరూ టీడీపీనే. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎక్కడి వారు.. ఎక్కడ పోటీచేశారు. చంద్రబాబే ట్రాన్స్‌ఫర్ తీసుకున్నాడు. హిందూపురం ఎన్టీఆర్ కన్నవారి ఊరా? బాలకృష్ణ అత్తగారి ఊరా?. బాలకృష్ణ ఏమైనా హిందూపురంలో పుట్టాడా. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పొలిటికల్ వ్యూహాలతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయ్. సీఎం జగన్‌లాగా చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేడు. 

>
మరిన్ని వార్తలు