ఆరు రోజులు.. రెండు స్వల్పకాలిక చర్చలు

22 Dec, 2023 04:45 IST|Sakshi

ముగిసిన శాసనసభ తొలి విడత సమావేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఇంధన రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ప్రకటించారు. డిసెంబర్‌ ఏడో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు కొత్తగా ఎన్నికైనవారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.

11న స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్, 13న నామినేషన్ల స్వీకరణ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. 14న నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. 15న శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు 16న శాసనసభ, మండలి వేర్వేరుగా సమావేశమై చర్చ అనంతరం ఆమోదం తెలిపాయి. ధన్యవాద తీర్మాన ఆమోదం అనంతరం శాసనమండలిని చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాస నసభను మాత్రం 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. 20న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, 21న ఇంధన రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదం నడుమ సాగింది.
 
26 గంటల 33 నిమిషాలు  ఆరురోజుల్లో శాసనసభ మొత్తంగా 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. 19 మంది సభ్యు లు చర్చలో పాల్గొనగా, రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మినహా మిగతా 118 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

>
మరిన్ని వార్తలు