జేసీ ప్రభాకర్‌కు ఎమ్మె‍ల్యే కేతిరెడ్డి ఓపెన్‌ సవాల్‌.. 

21 Dec, 2023 18:36 IST|Sakshi

సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాడిపత్రి అభివృద్ధి కి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. అభివృద్ధిని నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 

కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి రూ.52 కోట్లు రాకుండా అడ్డుకుంటున్నారు. 

సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదే. టీడీపీ పాలనలో సాగునీరు అడిగితే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదే.  సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదం. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక, టిక్కెట్ల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిదే తుది నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా మద్దతు ఉంటుంది. కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా నేను సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు