నేడు కాంగ్రెస్‌ మలి జాబితా!

27 Oct, 2023 04:51 IST|Sakshi

నేతల చేరికల నేపథ్యంలో జాప్యం 

గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేలా స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు 

పార్టీ సీఈసీ భేటీ తర్వాత విడుదల చేయనున్న నేతలు 

మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది. నేతల చేరికలు, మార్పుచేర్పుల నేపథ్యంలో విడుదల జాప్యమవుతోందని, శుక్రవారం రాత్రికల్లా మలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 34 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని తెలిపాయి. ఇందులో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు పూర్తి చేసిందని 
పేర్కొన్నాయి. 

అసంతృప్తిని చల్లార్చేందుకు..: కొన్నిరోజులుగా ఢిల్లీ వేదికగా మురళీధరన్‌ నేతృత్వంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో.. మలి జాబితా తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

ఇద్ద రు, ముగ్గురికిపైగా టికెట్లు ఆశిస్తున్న సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి.. నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. అవసరమైన వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బుజ్జగిస్తు న్నారు. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహు లు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కా గా.. శుక్రవారం కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. 

కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి 
బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌ కుమార్‌లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అంతకుముందు రాజగోపాల్‌రెడ్డి, మిగతా ఇద్దరు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పెద్దలను కలసి చర్చలు జరిపారు.

రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ చేరాలని వారు భావించారు. కానీ శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ సీఈసీ భేటీ ఉన్న నేపథ్యంలో.. అంతకన్నా ముందే పార్టీలో చేరితే అభ్యర్ధిత్వాలను పరిశీలించడం సాధ్యమవుతుందని పెద్దలు స్పష్టం చేశారు. దీంతో ఈ ముగ్గురి చేరికల తతంగాన్ని గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ముగ్గురు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలవనున్నారు. 

మరిన్ని వార్తలు