ఒడిశాలో కాం‍గ్రెస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బ..

22 Oct, 2021 13:25 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. నబరంగ్‌​ పూర్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌ మజీ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్‌ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు.. ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాల పట్ల కొంత అసహనంతో ఉన్నారని అన్నారు.

ప్రజలకు మరింత సేవ చేయడానికి తాను పార్టీని విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రదీప్‌ మజీ.. 2009లో నబరంగ్‌పూర్‌ లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో  ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఒడిశా యూత్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రదీప్‌ మజీ రాజీనామాపై జేపూర్‌ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బహినిపాటి మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ప్రదీప్‌ మజీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు బయటకు వెళ్లిపోవడం పార్టీకి మంచిదన్నారు. కాగా, లక్ష్మిపూర్‌ మాజీ ఎమ్మెల్యే కైలాష్‌ కులేశికా కాంగ్రెస్‌ పార్టీకి  గత బుధవారం రాజీనామా చేసి  బీజీడీలో చేరారు. ఈ క్రమంలో ప్రస్తుతం .. ప్రదీప్‌ మజీ కూడా పార్టీని వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మజ్‌హి కూడా అధికార బీజేడీలో చేరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: ‘అక్టోబర్‌ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’

మరిన్ని వార్తలు