‘అందుకే 15 రోజుల్లో కుట్ర అంటూ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు’

12 Nov, 2023 19:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గువ్వల బాలరాజును కేటీఆర్‌ పరామర్శించి మాపై ఆరోపణలు చేశారు. కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ చర్యలు సిగ్గుచేటు’’ అంటూ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘15 రోజుల్లో ప్రభుత్వంపై కుట్రలు జరగబోతున్నాయని డ్రామారావు అంటుండు. 2021లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై దాడి ఘటన జరిగింది. ఫలితాలు వచ్చిన తరువాత దాడిలో కుట్ర లేదని తేల్చారు.. తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు దాడి కత్తి చేశాడు. గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడారు. ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది. కానీ దాడిలో కుట్ర కోణం లేదని... సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారు. కేసులో అరెస్టు చేసిన ఆ యువకుడి రిమాండ్ రిపోర్ట్ ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదు?
రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టకపోవడంలో అంతర్యమేంటి?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

‘‘హరీష్ రావుకు.. దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా?. దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. కర్ణాటక నుంచి కూలి మనుషులను తెచ్చి కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు తిప్పికొట్టారు. గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారు. కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఛానళ్లకు ఫోన్‌లు చేశారు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి?. బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి?. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీఆరెస్, బీజేపీ, జేడీఎస్, ఎంఐఎం దుష్ట చతుష్టయం కుట్ర చేస్తున్నాయి’’ అంటూ రేవంత్‌ దుయ్యబట్టారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది?. రిటైర్ అయిన అధికారులపై చర్యలు చేపట్టాలని మేం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు స్పందన లేదు. ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది. బీజేపీ స్పష్టంగా బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్ వెంటనే బయటపెట్టాలి. హరీష్ అనుచరులు, రాజుకు మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా ఉంటే బయటపెట్టాలి. మేడిగడ్డ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలి. అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అధికారం కోసం ఎంతటి దారుణానికి తెగబడేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది’’ అని రేవంత్‌ మండిపడ్డారు.

‘‘మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోకాలికి, బోడిగుండుకు లింకుంపెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
తప్పుడు ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి. డిసెంబర్ లో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది. డిసెంబర్ 4 నుంచి  జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మీరు బిల్లు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండిషనల్ మద్దతు ఇస్తుంది. మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు. కాంగ్రెస్  కార్యకర్తలు  ఎవరూ భయపడొద్దు.. బీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పికొట్టండి. బీఆర్‌ఎస్‌ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీలో రాసి పెడుతున్నారు. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయి’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

24 గంటల ఉచిత విద్యుత్ పై సూటిగా సవాల్ విసురుతున్నా. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదాం.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు కేటీఆర్ వైఖరి ఉంది. కొడంగల్‌లో నన్ను ఒడిస్తానంటున్న కేటీఆర్ ముందు సిరిసిల్లలో చూసుకోవాలి’’ అని రేవంత్‌ కౌంటర్‌ ఇచ్చారు.
చదవండి: నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల

మరిన్ని వార్తలు