సూర్యాపేట జనగర్జన సభ: సోనియా, కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌

27 Oct, 2023 17:08 IST|Sakshi

సోనియా, కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌

సూర్యాపేటవాసులు అయోధ్య రావాలన్న అమిత్‌ షా

ఇప్పుటికైనా దళితుడిని సీఎం చేస్తావా కేసీఆర్‌: అమిత్‌ షా

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు స్పీడ్‌ పెంచారు. తాజాగా సూర్యాపేటలో బీజేపీ జన గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. సభలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సూర్యాపేట బీజేపీ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. కేసీఆర్‌.. కేటీఆర్‌ను సీఎం  చేయాలని అనుకుంటున్నారు. సోనియా గాంధీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పేదలు, దళితుల, బీసీల వ్యతిరేక పార్టీలు. కుటంబ పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయలేవు. దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. ఇప్పటికన్నా దళితుడిని‌ సీఎం చేస్తారా? అని ప్రశ్నించారు. 

మూడెకరాల భూమి ఏమైంది?
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది కేసీఆర్‌. ఇప్పుడైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా?. బీసీ సంక్షేమం కోసం‌ ఏటా పది వేల‌కోట్లు కేటాయిస్తామని అన్నారు‌ ఏమయ్యాయి ఆ నిధులు. ఈ రెండు పార్టీలు కుటుంబ సభ్యుల కోసమే పనిచేసే పార్టీలు. తెలంగాణలో పసుపు రైతులు కోసం జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేశాం. సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీని మంజూరు చేశాం. తెలంగాణ అభివృద్ధి అన్ని విధాల కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్‌ చేసిందేమీ లేదు.

అయోధ్యకు మీరంతా రండి..
ఐదు వందల యాభై ఏళ్ల పోరాటం అయోధ్య రామాలయ నిర్మాణం. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా? వద్దా?. జనవరి 22న ప్రధాని మోదీ రామమందిరంలో పూజ చేయబోతున్నారు. జనవరి చివరి వారంలో మీరందరూ అయోధ్యకు రావాలి. ప్రధాని మోదీ అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఎకరాకు ఆరు వేలు ఇస్తున్నాం. మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముప్పై లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. ప్రతీ ఒక్కరికీ ఐదు కిలోల బియ్యాన్ని గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్నాం.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి’ అని కోరారు. 

ఇది కూడా చదవండి: రేవంత్‌, ఉత్తమ్‌ కుమార్‌కు కేసీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

మరిన్ని వార్తలు