సీఎం కేసీఆర్‌ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి

2 Aug, 2023 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలనను సీఎం కేసీఆర్‌ పూర్తిగా గాలికి వదిలేశారని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎలీ్ప) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ‘బీఆర్‌ఎస్‌ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక విమానాల్లో పొరుగు రాష్ట్రాల నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించుకుని గులాబీ కండువాలు కప్పారు. కానీ వరదలతో ముప్పు ఉందని, తమకు హెలికాప్టర్లు, రెస్క్యూటీంలను తమ ప్రాంతాలకు పంపాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావులు కోరినా పెడచెవిన పెట్టారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులకు గులాబీ కండువాలు కప్పడంపై ఉన్న శ్రద్ధ తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడంపై సీఎం కేసీఆర్‌ పెట్టి ఉంటే బాగుండేది.’అని ఆయన వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు వస్తాయని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్ర మత్తం చేయని కారణంగానే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ అశ్రద్ధ, మానవ తప్పిదాల వల్లనే గతంలో ఎన్నడూ లేని విధంగా 60 మంది చనిపోయారని, ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. 

ఇష్టారాజ్యంగా చెక్‌డ్యాంలు నిర్మించిన కారణంగానే 
చెరువుల నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోని కారణంగా 69 చెరువులు తెగిపోయి ఒక్కసారిగా వాగులు పొంగి మోరంచపల్లి అనే గ్రామం మునిగిపోయిందని భట్టి నిందించారు. సాంకేతిక ప్రమాణాలతో కాకుండా రాజకీయ అవసరాల కోసం ఇష్టారాజ్యంగా చెక్‌డ్యాంలు నిర్మించారని, శాస్త్రీయత లేకుండా సీఎం కేసీఆర్‌ సొంత ఆలోచనలతో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మించిన కారణంగానే మంథని, చెన్నూరు, మంచిర్యాలలో పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయని అన్నారు.

వరదలపై సమీక్షలు మేనెలలోనే నిర్వహించాల్సి ఉన్నా ఎందుకు చేయడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన అధికారులను వరద ముంపు గ్రామాలకు పంపి అక్కడ నష్టాలను అంచనా వేయించి వెంటనే పరిహారం అందించేలా సీఎస్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

రూ.1000 కోట్లు ఎక్కడ? 
ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్న సీఎం కేసీఆర్‌ భద్రాచలం రాముడిని కూడా మోసం చేశారని భట్టి వ్యాఖ్యానించారు. ‘వరదలు వచి్చనప్పుడు భద్రాచలం పట్టణం ముంపునకు గురికాకుండా ఉండేందుకు కర కట్టలు, కాలనీల నిర్మాణం కోసం రూ.1000 కోట్లు ఇస్తామని గతంలో చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి భద్రాచలం ముంపునకు గురైనప్పటికీ రూపాయి ఇవ్వలేదు. దేవుడినే మోసం చేసిన కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలని భద్రాచలం రాముడిని మొక్కి వచ్చాను’’అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత కాంగ్రెస్‌ పారీ్టపై ఉందని, వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ శ్రేణులు ముమ్మరంగా పాలుపంచుకోవాలని, వరద బాధితులకు ధైర్యం ఇచ్చి అండగా నిలవాలని భట్టి పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు