బీజేపీ వైపే ప్రజాతీర్పు

21 Nov, 2023 04:34 IST|Sakshi

దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఫలితాలే పునరావృతం

 అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు 

పదేళ్ల కేసీఆర్‌ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో ఏటీఎంగా మారుతుంది.. బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక ఎప్పటికీ కోలుకోలేనంతగా పరిస్థితి దిగజారుతుంది 

మోదీ సహా అగ్రనేతల ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన 

కరీంనగర్‌లో నేను ప్రజలను నమ్ముకున్నా.. గంగుల పైసలు నమ్ముకున్నారు 

బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌

ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చేలా దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘పదేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీనికి కారణమెవరో అన్నివర్గాల ప్రజలు, మేధావులు విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ఈ పీకల్లోతు అప్పులు తీరి సజావుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు..’ అని చెప్పారు.

‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో ఏటీఎంగా మారుతుంది. బీఆర్‌ఎస్‌ గెలిస్తే మరిన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇక ఎన్నడూ కోలేకోలేనంత స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టే మెజారిటీ సీట్లలో బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చేలా కీలకమైన తీర్పు ఇవ్వబోతున్నారు..’ అని పేర్కొన్నారు.

‘అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం పక్కా. కేసీఆర్‌ కూడా అదే కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల గురించి చెబుతోంది కానీ గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోరనే గ్యారంటీ మాత్రం ఇవ్వడం లేదు..’ అని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో..ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ ప్రచార సరళి తదితర అంశాలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బండి   సంజయ్‌ తన అభిప్రాయాలు వెలిబుచ్చారు.  

ఏయే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి? 
ఉద్యోగఖాళీలు భర్తీ కాకపోవడం, టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన 17 పేపర్లు లీక్‌ కావడంపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరుసగా అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకోలేదు. ధాన్యం క్వింటాల్‌కు 5 నుంచి 10 కేజీల తరుగు, రుణమాఫీ హామీ పూర్తిగా చేయకపోవడం ఇతర సమస్యలు రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తమ కుటుంబాల్లోని మగవారు.. భర్తలు, కొడుకులు మద్యానికి, గంజాయికి, డ్రగ్స్‌కు బానిసలై కుటుంబాలు చిన్నాభిన్నం కావడంపై మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

మొక్కుబడిగా కొన్ని తప్ప డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మెజారిటీ పేదలకు అందలేదు. హామీలే తప్ప కొత్త పింఛన్లు ఇవ్వలేదు. గత పదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కొత్త రేషన్‌కార్డు జారీ చేయలేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకవర్గం ఓట్ల కోసమే తహతహలాడుతున్నాయి. 80 శాతమున్న హిందూ సమాజం ఓట్ల గురించి ఆలోచించడం లేదు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలన చూశాక, అందుతున్న ఫలితాలను గురించి తెలుసుకున్నాక రాష్ట్ర ప్రజల్లో ఆలోచన మొదలైంది.

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమని డిసైడ్‌ అయ్యారు. మెజారిటీ సీట్లలో గెలిచి రాష్ట్రంలో బీజేపీ అధికారానికి రావడం ఖాయం. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరుద్యోగ యువకులు, రైతులు, ఉద్యోగులు, ఆడపడుచులు ఒక్కొక్కరు ఇతరుల ద్వారా కనీసం మూడేసి ఓట్లు బీజేపీకి పడేలా చూడాలని కోరుకుంటున్నా. ప్రజల కోసం పోరాడిన బీజేపీ పక్షాన నిలుస్తారా? ప్రజాధనాన్ని కొల్లగొట్టే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల వైపు ఉంటారా? అన్నది ప్రజలు ఆలోచించాలి.  

బీజేపీ బీసీ నినాదం ఏ మేరకు పనిచేస్తుంది?
ఉమ్మడి ఏపీ చరిత్రలో, తెలంగాణ ఏర్పడ్డాక ఏనాడూ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం కాకపోవడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దేశంలోని ఏ జాతీయ పార్టీ కూడా బీసీని సీఎంను చేయాలని ఆలోచించలేదు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సందర్భం లేదు. గతంలో కేసీఆర్‌ దళితున్ని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాల్లోని పేదలు కూడా బీసీల్లోని పేదవర్గం వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 23, కాంగ్రెస్‌ 19 సీట్లే బీసీలకు కేటాయిస్తే బీజేపీ 36 కేటాయించింది. కేంద్ర కేబినెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా 27 మంది ఓబీసీ, 12 ఎస్సీ, 8 ఎస్టీ వర్గాల వారు మంత్రులయ్యారు. బీసీ వర్గానికి చెందిన పేద వ్యక్తి మోదీప్రధాని కావడం వల్ల దేశంలోని అన్ని వర్గాల పేదలకు న్యాయం (ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో సహా) జరుగుతోంది. అందువల్ల బీజేపీ బీసీ నినాదం అన్నివర్గాల ప్రజల్లో చర్చనీయాంశమైంది. 

బీజేపీ అగ్రనేతల ప్రచారానికి స్పందనెలా ఉంది? 
రాష్ట్రంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, ఆదివాసీ మహిళ ద్రౌపదీముర్మును రాష్ట్రపతి చేయడంతో ఎస్టీ వర్గాల ఓట్లు, ఇలా వివిధ వర్గాల నుంచి ఊహించని విధంగా వస్తున్న స్పందనను చూశాకే బీజేపీ వైపు ప్రజలు నిలవబోతున్నారని, తెలంగాణలోనూ మోదీ నాయకత్వాన్ని బలపరచబోతున్నారనే విషయం స్పష్టమౌతోంది.

కాంగ్రెస్‌లోని నేతలంతా సీఎం అభ్యర్థులే కాబట్టి వారు పార్టీ పరంగా లేదా సొంతంగా ప్రచారం చేసేందుకు అంతగా మొగ్గుచూపడం లేదు. బీజేపీ నేతలు మాత్రం ఒక ప్లాన్‌ ప్రకారం ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు, సమస్యలు వివరించి వారి మద్దతు కూడగట్టగలుగుతున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ అన్నింటినీ తనవిగా ప్రచారం చేసుకోవడం, సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా కేంద్రం చేస్తే తాను చేసినట్టు చెప్పుకోవడం గురించి బీజేపీ చెబుతుంటే ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.   

ఉత్తర తెలంగాణలో ఎలా ఉండే అవకాశం ఉంది? 
ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా ఈ ప్రాంతంలో బీజేపీ బలంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కరీంనగర్‌లో మంత్రిగా గంగుల కమలాకర్‌కు బీఆర్‌ఎస్‌ ఆలస్యంగా బీఫామ్‌ ఇచ్చింది. ఇక్కడ పోటీలో ఉన్న నేను ప్రజలను నమ్ముకుంటే, మంత్రి పైసలను నమ్ముకున్నారు. ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోనిదే అయినా ఒక్కరికి కూడా కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలు విషయంలో తరుగు లేకుండా చేయలేకపోయారు.

ఈ–కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేను ఎంపీగా గెలిచాక రూ.9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. కేసీఆర్‌ను గడగడలాడించిన వ్యక్తి సంజయ్‌ అనే పేరు ప్రజల్లో వచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్‌లో వార్‌ వన్‌సైడ్‌ అన్నట్టుగా పరిస్థితులున్నాయి. మంచి మెజారిటీతో నేను గెలవబోతున్నా. కర్ణాటకలో గెలుపే తెలంగాణలో కాంగ్రెస్‌ కొంప ముంచబోతోంది.

అక్కడ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో, ఐదారు నెలలు కూడా తిరగకుండానే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిలదీస్తున్న పరిస్థితులున్నాయి. దీనిని చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు గుర్తించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మోదీ ప్రభుత్వం రాబోతోంది కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే మళ్లీ అవినీతికి తలుపులు తెరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో సీఎం అయ్యే అవకాశం లేని వారు, ఇతర నేతలు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా దీనిని గుర్తించారు.  

-కె.రాహుల్‌  

మరిన్ని వార్తలు