అవినీతి బాబు చుట్టూ..రాజకీయమేంటి?

4 Nov, 2023 03:11 IST|Sakshi

కులం పేరుతో కట్టడి మంత్రమేంటి? 

పవన్, చంద్రబాబు రాజకీయ ఎత్తులేంటి? 

ఏపీలో ఒక రకంగా.. తెలంగాణలో ఇంకో తీరా? 

సెటిలర్స్‌ పేరుతో గాయాన్ని రేపడం సరికాదు 

టీడీపీ కేవలం ఒక సామాజిక వర్గానిదేనా? 

ఎన్టీఆర్‌ బీసీలకు 50% అంటే... వీళ్లేంటి ఇలా? 

రోత పుట్టిస్తున్న నేటి రాజకీయాలు 

సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ

కులం పునాదులతో రాజకీయాలేంటి? ఎవరో కొందరు..ఎవరి కోసమో ఈ నాటకాలాడితే ఎలా? మాసిపోయిన ‘సెటిలర్స్‌’ గాయాన్ని గెలికి గెలికి... పుండుగా చేయడం న్యాయమా?.. ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా ప్రసిద్ధి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ సంధించిన ప్రశ్నలివి. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల జరిగే నష్టాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇదే అదనుగా అందరికీ ‘కమ్మ’ రంగు పులమడం సరికాదని తమ్మారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దివంగత ఎన్టీఆర్‌ కూడా టీడీపీని కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. తికమక పెట్టే రాజకీయాలు..ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూస్తున్నామనేది ఆయన భావన. తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్‌ మూడ్‌ మొదలుకొని, మారుతున్న రాజకీయాలపై తమ్మారెడ్డి విస్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఆయనేమన్నారంటే....? 

పవన్‌ రాజకీయమేంటి? 
పవన్‌కల్యాణ్‌ రాజకీయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోనే ఉంటానంటాడు. బీజేపీని వదిలేస్తానంటాడు. తెలంగాణకు వచ్చి బీజేపీకి మద్దతిస్తాడు. కలిసి పోటీ అంటాడు. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాతే కదా... జనసేన, టీడీపీ పొత్తు బంధం బయటకొచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్‌కే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదేంటి? చంద్రబాబు పార్టీ వాళ్లేమో తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా మోస్తామంటున్నారు.

పవన్‌ మాత్రం బీజేపీ గొడుక్కిందకు వెళ్తానంటున్నాడు. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో తన కేడర్‌ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్‌ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్, చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో గానీ... తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్లగలరా? ఈ తరహా రాజకీయాలు కొంత గందరగోళపరుస్తున్నాయి.  

ఇక్కడ సెటిలర్స్‌ హ్యాపీ..  కానీ ఇప్పుడు ఆ నిరసనలేంటి? 
తెలంగాణ ఏర్పడిన రోజుల్లో స్థానికేతరుల్లో కొంత టెన్షన్‌ ఉన్నమాట నిజం. ఇప్పుడది లేదు. అంతా కలిసిపోయి ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమంది మళ్లీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. సెటిలర్స్‌ పేరుతో ముందుకొస్తున్నారు. దీన్ని ఓ సామాజికవర్గం నెత్తికెత్తుకోవడం విశేషం. సెటిలర్స్‌ అనేది మాసిపోయిన గాయం. కొంతమంది కోసం ఈ గాయాన్ని రేపుతున్నారు. పుండులా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్స్‌ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై నిరసనలేంటి? సెటిలర్స్‌లో కమ్మవాళ్లే ఉన్నారా? అన్ని కులాల వాళ్లూ ఉన్నారని గుర్తించాలి. ఇది అందరి ప్రయోజనాలు దెబ్బతీస్తుందని తెలుసుకోవాలి.  

‘చిత్రం’లోనూ మార్పులు 
రాజకీయాలపై సినిమా ప్రభావం కీలకం. రాజకీయాల నుంచే సినిమా వస్తుందా? సినిమా రాజకీయాలకు ప్రేరణ ఇస్తుందా? అనేది చెప్పలేం. కానీ ప్రజాజీవితాలకు దగ్గరగా ఉండే రాజకీయ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అంతే కాదు... కరుడుగట్టిన కాషాయం రంగుతో తీసిన సినిమాలు ప్లాప్‌ అవుతున్నాయి. అంటే మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అది కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది గ్లోబలైజేషన్‌ ఎఫెక్ట్‌ మాత్రమే. అలా అని నిరుద్యోగమూ పూర్తిగా పోలేదు. యువత ఆలోచనకు ఇదే కారణమైంది.

రైతుబంధు ఇస్తున్నామని చెప్పే నేతలు... రూ.కోట్లు ఉన్నవాడికి కూడా ఇవ్వడం న్యాయమేనా? అనేక కష్టనష్టాలకోర్చే కౌలు రైతులకు ఇవ్వకపోవడం ధర్మమేనా? సామాజిక పరిస్థితుల నుంచే ప్రజాతీర్పు వస్తుంది. ఒకటి మాత్రం నిజం. గెలిచే వాళ్ల వైపే ప్రజలు ఉంటారు. అందుకే వామపక్షాలు ఉద్యమించే చరిత్ర ఉన్నా, ఓట్లు పొందలేకపోతున్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజలిచ్చిన అధికారం రాచరికంగా భావించే నాయకులను ఓటు ఆ«యుధంతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి. వాళ్ల కోరలు పీకి వేయాల్సిందే. 

అసలేంటీ వైఖరి? 
చంద్రబాబునాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయ్యారు. దీన్ని కొంతమంది తమ సామాజికవర్గం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని వాళ్ల నమ్మకం కావొచ్చు. అది కోర్టులో తేలాలి. కానీ ఆ కసి తెలంగాణ రాజకీయాలపైనా చూపించే ప్రయత్నమేంటి?

 ఒక సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా ఓ పార్టీని సమర్థిస్తుందని ప్రచారం చేయడంలో అర్థమేంటి? టీడీపీ  ఒక సామాజిక వర్గానిదేనా? అదే నిజమైతే ఎన్టీఆర్‌ 50 శాతం బీసీలకే టికెట్లు ఎందుకిచ్చా రు? అసలు కులం ప్రస్తావనేంటి? వాళ్లు చెప్పే కులమే అంత బలమైనది అయితే, 2014లో ఎందుకు తెలంగాణలో ఓడిపోయింది? ఇలా ప్రచారం చేయడంలో ఓ కుట్ర కనిపిస్తోంది. తెర వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు.  

- వనం దుర్గాప్రసాద్‌ 

మరిన్ని వార్తలు