సోమవారం జార్ఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష.. అప్పటి వరకు హైదరాబాద్‌లోనే

3 Feb, 2024 11:26 IST|Sakshi

జార్ఖండ్‌లో కొత్తగా కొలువుదీరిన సీఎం చంపయ్‌ సోరెన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్షకు తేదీ ఖరారైంది. సోమవారం జార్ఖండ్‌ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని స్పీకర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా కూటమి ప్రభుత్వానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో బస చేస్తున్నారు. తమ సంఖ్యా బలాన్ని కాపాడుకునేందుకు, ఇతర పార్టీల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతున్నారు.

సోమవారం ఫ్లోర్‌ టెస్ట్‌ జరిగే వరకు కూటమి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లో ఉండనున్నట్లు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.

ఇక భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌ను ఈడీ విచారించడం, అరెస్ట్‌ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్‌ రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్‌ సోరెన్‌ను ఎన్నుకున్న తరువాత శుక్రవారం జార్ఖండ్‌ నూతన సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.

తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం అసెంబ్లీ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. కాగా జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81  స్థానాలు ఉన్నాయి. మెజార్జీని నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యే మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జేఎంఎం(28)-కాంగ్రెస్(16)- ఆర్జేడీ(1), సీపీఎంఎల్‌(1)  కూటమికి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, అజిత్‌ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడిన  ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో జార్ఖండ్‌ రాజకీయాలు ఏ మలుపు తిరుగనున్నాయో.. ఎవరూ అధికారం చేపట్టనున్నారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
చదవండి: కేజ్రీవాల్‌ జైలుకెళ్తే.. ‘ఆప్‌’ ఏం చేయనుంది?

whatsapp channel

మరిన్ని వార్తలు