సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..

16 Nov, 2023 19:09 IST|Sakshi

బెంగళూరు: క‌ర్నాట‌క ముఖ్యమంత్రి సిద్ధరామ‌య్య కుమారుడు య‌తీంద్రకు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. 

వీడియోలో.. ఓ మీటింగ్‌లో జ‌నం మ‌ధ్య ఉన్న యతీంద్ర తన తండ్రి సిద్ధరామయ్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో సీఎం చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘వివేకానంద.. ఎక్కడ? నేను ఆ పేరు ఇవ్వలేదు.. ఈ మహదేవ్‌ ఎవరు? నేను అయిదు మాత్రమే ఇచ్చాను’ అని మాట్లాడారు..ఈ వీడియోను జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ట్విటర్‌లో షేర్‌ చేశారు. క్యాష్‌ఫర్‌ పోస్టింగ్‌ (ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం) కుంభకోణంలో యతీంద్ర భాగమయ్యారని ఆరోపించారు. 

రాష్ట్రంలో క్యాష్ ఫ‌ర్ పోస్టింగ్ స్కామ్ న‌డుస్తోంద‌ని, ఎలాంటి భ‌యం లేకుండా  అవినీతి చోటుచేసుకుంటున్న‌ట్లు అన్నారు.. దానికి సాక్ష్యం ఈ వీడియోనే అని తెలిపారు. సీఎం ఆఫీసు క‌లెక్ష‌న్ కేంద్రంగా మారింద‌ని,  సిద్ద‌రామ‌య్య కుమారుడు క‌లెక్ష‌న్ల‌కు రాకుమారుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్ద‌రూ ట్రాన్స్‌ఫ‌ర్ మాఫియా న‌డిపిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

అయితేకొడుకు వీడియోపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. యతీంద్రపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. యతీంద్ర తెలిపిన జాబితా వరుణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల భవనాల మరమ్మతుల కోసం కేటాయించిన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) ఫండ్స్‌ గురించి అని తెలిపారు. క్యాష్‌ ఫర్‌ ఫోస్టింగ్‌ గురించి కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో సుధీర్ఘ పోస్టు చేశారు.

అయిదు పేర్లు అని చెబితే బదిలీ అవుతుందా అని ప్రశ్నించారు. ఒకవేళ తాము మాట్లాడింది క్యాష్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.  కాగా వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 
చదవండి: సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్‌ క్లారిటీ

మరిన్ని వార్తలు