29న రాష్ట్ర కేబినెట్‌ భేటీ?

27 Sep, 2023 04:43 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ నిర్ణయం!

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయానికి అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించినట్టు తెలిసింది. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా డాక్టర్‌ దాసోజు శ్రావణ్‌ కుమార్, కుర్ర సత్యనారాయణలను నామినేట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 171(3), 171(5)లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రావీణ్యత కానీ ఆచరణాత్మక అనుభవం కానీ లేకపోవ డంతో వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తు న్నట్టు గవర్నర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ లేవనెత్తిన అంశాలకు సమాధా నమిస్తూ మళ్లీ వారి పేర్లనే సిఫారసు చేస్తూ... గవర్నర్‌ కోరిన వివరాలను పూర్తిగా తిరిగి పంపించాలని భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు సన్నద్ధతపై సైతం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించడానికి కొత్త పథకాలు, కార్యక్రమాల అమలుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిసింది. అయితే మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.

మరిన్ని వార్తలు