కామారెడ్డితో పుట్టుక నుంచే అనుబంధం.. కేసీఆర్‌ వస్తే రూపురేఖలు మారుస్తడు

9 Nov, 2023 15:40 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి గడ్డతో పుట్టుక నుంచే తనకు సంబంధం ఉందని, తన కన్నతల్లి పుట్టింది ఇక్కడి ఊరిలోనేనని.. తన బాల్యం కూడా ఇక్కడ గడిచిందని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజులపాటు ఇక్కడ జలసౌధ ఉద్యమం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

గురువారం కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన అనంతరం.. ఆయన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. కామారెడ్డిని జిల్లా చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అది చేసి చూపించాం. మెడికల్‌ కాలేజ్‌ కూడా తెచ్చుకున్నాం. నిజామాబాద్‌, కామారెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు ఇక్కడి ఎమ్మెల్యే గంపా గోవర్థన్‌రెడ్డి చాలాసార్లు తనను కోరడంతోనే కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారాయన. 

‘‘కేసీఆర్‌ కామారెడ్డి వస్తున్నాడంటే ఒక్కడే రాడు. కేసీఆర్‌ వెంబడి చాలా వస్తాయి.  కేసీఆర్‌ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కామారెడ్డి పల్లెల రూపు రేఖలు మార్చే బాధ్యత నాది’’ అని ఆయన అన్నారు.

తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం.  దేశాన్ని, రాష్ట్రాన్ని  50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసింది?.  మన నెత్తిన సమస్యల్ని పెట్టింది.  నెహ్రూనే దళితబంధు పెట్టి ఉంటే.. ఇప్పుడు ఈ స్థితి ఉండేది కాదు కదా.  రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా? ఒక్కపూట వ్యవసాయం చేయని రాహుల్‌ గాంధీ.. ధరణిని తీసేస్తాడట. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటలు కరెంట్‌ ఇవ్వడం లేదు. కానీ, తెలంగాణలో 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నాం.  24 గంటల కరెంట్‌ కావాలా? 3 గంటల కరెంట్‌ ​కావాలా?(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..). ఒక్క నవోదయ స్కూల్‌ కూడా ఇవ్వని బీజేపీకి.. ఒక్క ఓటు ఎందుకు వేయాలి? అని అన్నారాయన.  

అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికులు అందరికీ పెన్షన్‌ ఇస్తామని ఈ వేదికగా కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టింది. తమాషా కోసం ఓటు వేయొద్దు. బాగా ఆలోచించుకుని ఓటు వేయాలి. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాన్ని మరిచిపోవద్దు’’అని కేసీఆర్‌ కామారెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు.

మరిన్ని వార్తలు